- హైదరాబాద్‌లోనే ప్లాన్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇక్కడే వ్యూహరచన
- పాలసీ మార్చిన పథకం
- 100 కోట్ల డీల్‌లో సౌత్ గ్రూప్
టీఎస్ న్యూస్ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖల పేర్లు బయటకు రావడంతో ఈ కేసు కీలకంగా మారింది. ఈ కేసులో అనేక మంది అరెస్టయ్యారు. తాజాగా కేసీఆర్కుమార్తె కవిత అరెస్ట్ కావడంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాం మరోసారి చర్చకెక్కింది. అటు ఏపీ నుంచి పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వీరితో పాటు ఢిల్లీలో అధికార పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా అరెస్టయ్యారు. వందల కోట్లు ఈ స్కామ్ లో చేతులు మారాయన్న ఆరోపణలు ఈడీ అధికారుల నుంచి వినిపించాయి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్నారు.
ఇదే కేసు
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చింది. అప్పటి వరకూ మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వాటిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తూ 2020 సెప్టంబరులో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే అనేక అనుమానాలకు తావిచ్చింది. నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది నూటికి నూరు శాతం ప్రైవేటుగా మారింది. దీనివల్ల రూ.3,500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందని వ్యాపారులకు ఢిల్లీలో లిక్కర్ షాపులు అప్పగించారన్న ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ పాలసీని రూపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 జనవరిలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్ లు ఉన్నారు. అయితే ఈ మంత్రల బృందం లిక్కర్ కొత్త పాలసీని తయారు చేసింది. మే 21 2021న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఈ పాలసీలో డబ్బులు చేతులు మారాయని ఉప్పందడంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయాలాని కోరారు. అప్పటి నుంచి ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో అనేకమంది నిందితులుగా చేరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చి అనేకసార్లు విచారించారు. ఢిల్లీలోనీ ఈడీ కార్యాలయానికి రప్పించి విచారణ జరిపారు. కవిత తన పదహారు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని, ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించారని కూడా గతంలో ఈడీ అధికారులు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని కనుగొన్న అధికారులు ఆ దిశగానే విచారణ జరిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్‌లోనూ, ఢిల్లీలో ఒక స్టార్ హోటల్ లో నిందితులు సమావేశమై ఈ స్కామ్ కు పాల్పడినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. సుదీర్థకాలం విచారణ జరిపిన తర్వాత కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఫీజులు పెంపు:
ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్-1 లైసెన్స్ కోసం కాంట్రాక్టర్లు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గతంలో రూ.25 లక్షలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్ సర్కార్. బడా మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ ఫీజును పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఢిల్లీలో చిన్న కాంట్రాక్టర్ల దుకాణాలు మూతపడ్డాయి. బడా మద్యం కంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. అంతేకాదు మద్యం మాఫియా ఈ పాలసీలో వేలు పెట్టిందని, ఆప్ నాయకులు, అధికారులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.అయితే లైసెన్స్ ఫీజు పెంచడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరిందని కేజ్రీవాల్ ప్రభుత్వం వాదించింది. అందుకే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గించినట్టు చెప్పుకొచ్చింది. కొత్త మద్యం పాలసీలో అదే 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ ధరను రూ.530 నుంచి రూ.560కి పెంచారు. దీంతోపాటు రిటైల్ ట్రేడర్ లాభం కూడా రూ.33.35 నుంచి రూ.363.27కు పెరిగింది. అంటే రిటైల్ వ్యాపారుల లాభం 10 రెట్లు పెరిగింది.
దర్యాప్తు ఎలా ప్రారంభమైంది?
ఈ మద్యం పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
అరెస్టుల పర్వం:
ఈ కేసులో ఎక్కువగా అరెస్టైన వారంతా ఆమ్ ఆద్మి పార్టీ ప్రముఖులే. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్, సమీర్ మహేంద్రూ, అరుణ్ రామచంద్రన్, రాజేష్ జోషి, గోరంట్ల బుచ్చిబాబు, అమిత్ అరోరా, బెనాయ్ బాబు (ఫ్రెంచ్ లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్ జనరల్ మేనేజర్), అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పి శరత్ చంద్రారెడ్డి, వ్యాపారవేత్త అమన్ దీప్ ధాల్, వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్ పల్లి ఉన్నారు. ఈ కేసులో దాదాపు 80 మందికిపైగా విచారణ చేయగా.. వీరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఉన్నారు. తాజాగా కవితను అదుపులోకి తీసుకున్నారు.
కవిత పాత్ర ఏంటి?
మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో ‘సౌత్ గ్రూప్’ ఒకటి. ఈ గ్రూప్‌ని కంట్రోల్ చేసే వారిలో వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్‌కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కవిత చుట్టూ ఉచ్చు ఎలా బిగుసుకుంది?
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని గతేడాది(2023) మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్‌లో పిళ్లై కీలక సభ్యుడు. కవితకు కీలక సూత్రధారిగా, గ్రూప్ ఫ్రంట్ మ్యాన్‌గా పిళ్లై కవిత సూచనల మేరకే వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడిన ‘సౌత్ గ్రూప్’ ఈ లిక్కర్ స్కామ్‌లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. కవిత ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా. పిళ్లై ఈ విషయాన్ని తమ వాంగ్మూలంలో చెప్పారు. ఇక ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పిళ్లై ప్రమేయం ఉందని, విజయ్ నాయర్ కు ఇన్ పుట్స్ ఇచ్చారని చెబుతోంది.
అయితే. దర్యాప్తు సంస్థ అనేకసార్లు సమన్లు జారీ చేసినా ఈడీ ముందు కవిత హాజరుకాకుండా ఉండేవారు. దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు మహిళలను పిలవకుండా సీఆర్పీసీ ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినప్పటికీ తనను తమ ముందు హాజరుకావాలని ఈడీ కోరుతోందని పేర్కొంటూ ఆమె గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు తనను ప్రశ్నించే ప్రదేశాన్ని ఎంచుకునే అవకాశాన్ని తనకు ఇవ్వాలని ఆమె వాదించారు. కవిత పిటిషన్‌పై మొదటి విచారణ 2023 మార్చిలో జరిగింది. తన పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థిస్తూ వస్తున్నారు.
సీబీఐ ఏం చేస్తుంది?
తాజాగా కవితను అదుపులోకి తీసుకుంది ఈడీ. అటు సీబీఐ కూడా ఈ కేసులో కవిత పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. గత ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ ఇటీవల కవితను కోరింది. అయితే సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరారు. నోటీసును రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని అడిగారు. డిసెంబర్ 2022లో తన నివాసంలో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తనను విచారించారని ఆమె గుర్తు చేశారు. తన పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉందని కవిత చెప్పుకొచ్చారు. అయితే దర్యాప్తు సంస్లథకు తన నుంచి ఏదైనా సమాచారం అవసరమైతే వర్చువల్‌గా హాజరయ్యేందుకు రెడీగా ఉంటానని కవిత చెప్పేవారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేయడం ఆమెను అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.