కర్ణాటకలో ఆపరేషన్ కమల్

Karnataka Operation Kamal -టెన్షన్ లో సంకీర్ణ సర్కార్

ఒక పక్క దేశం అంతా రానున్న ఎన్నికల నేపధ్యంలో జరుగుతున్న జాతీయ రాజకీయ పరిణామాలను ఆసక్తిగా చూస్తుంటే ఇదే సమయంలో కర్నాటక రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌, జేడీఎస్ దోస్తిని మూడు రోజుల ముచ్చటగా మార్చేందుకు కమలనాధులు తీవ్ర స్ధాయిలో ప్రయత్నిస్తుంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. సంక్రాంతి తరువాత ముహూర్తం ఖారారయ్యిదంటూ వినిపిస్తున్న ఊహగానాలతో అటు జేడీఎస్ ‎ఇటు కాంగ్రెస్ అప్రమత్తమయ్యాయి. తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరకుండా ప్రయత్నాలు చేపట్టాయి. కర్నాటకలో రాజకీయం రంజుగా మారింది. కాంగ్రెస్‌- జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపణలు చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు పార్టీ మారితే 30 కోట్లు ఇస్తామంటూ బీజేపీ నేతలు ఆఫరిస్తున్నాయని సిద్ధరామయ్య ఆరోపించారు. తమ మధ్య కుదిరిన పొత్తును జీర్ణించుకోలేకే ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ సీఎం కుమారస్వామి ఘాటుగా విమర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి శివకుమార్ కూడా బీజేపీపై ఇదే తరహాలో విమర్శలు గుప్పిస్తూనే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ప్రకటించి మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించిన శివకుమార్‌. వీరిని ముంబైలోని ఓ హోటల్లో ఉంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
ఇదే సమయంలో బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్టు ప్రకటించి బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ఓ వైపు కాంగ్రెస్ నేతల విమర్శలు కొనసాగుతుండగానే బీజేపీ తమ ఎమ్మెల్యేలను గురుగావ్ తరలించడం కన్నడ రాజకీయాలను మరింత వేడెక్కించింది. కాంగ్రెస్- జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు ఏమాత్రం లేదన్న పార్టీ నేత యడ్యూరప్ప… తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని సీఎం కుమారస్వామి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అటు సంకీర్ణ పక్షాలు, ఇటు ప్రతిపక్షం పరస్పర ఆరోపణలతో కన్నడ రాజకీయం గంటకో మలుపు తిరుగుతోంది. ఏ పార్టీకి చెందిన సభ‌్యులు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్ష మవుతారోనని మూడు పార్టీల అధినేతలు మధనపడుతున్నారు. అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్ కూటమి .. అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉండటంతో కన్నడ రాజకీయాలు అటు ఆసక్తి ఇటు ఉత్కంఠ రేపుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article