జర్నలిస్టుల నిధికి రూ.17.50 కోట్లు

KCR 17.50 Cr fund to Journos

అదేంటో కానీ ఎన్నికలొచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టులు, వారి సంక్షేమం భలే గుర్తుకొస్తుంది. ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారు. అవి  కూడా చిన్న చిన్న సమస్యలే సుమా.. అలాగనీ, సొంతిల్లు కట్టివ్వమంటే కట్టివ్వరు. దాన్ని ఊసేత్తరు. సుప్రీం కోర్టులో కేసంటారు. జర్నలిస్టు సంఘాల మధ్య ఐక్యత లేదంటారు. కొందరు మీడియా పెద్దల్ని, జర్నలిస్టు సంఘాల నాయకులకు ఏవో మాయమాటలు చెప్పి వారి నోరు మూయిస్తుంటారు. ఇక, కొందరు జర్నలిస్టులమని చెప్పుకునే పెద్దలు ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి ఎంతో కొంత లాభం పొందుతుంటారు.  అందుకే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఆరేండ్లయినా హౌసింగ్ స్కీము ముందుకెళ్లడం లేదు. ఈ విషయం ప్రతిఒక్కరికీ తెలిసిందే.

గత శాసనసభ ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల సొంతింటి ఫైలును అధికార పార్టీ కొంత కదలిచ్చింది. కమిటీ ఏర్పాటు చేసి.. అక్కడా ఇక్కడా కొన్ని ప్రాంతాల్లో తిప్పించి హడావిడి చేసింది. ఇంకేముంది ఉగాది రోజున స్టార్ట్ చేసేద్దామన్నారు పెద్ద సారు. అది నిజమేనని చాలామంది నమ్మేశారు. ఆ తర్వాత, ఎన్నికల్లో గెలవగానే మళ్లీ దాని ఊసెత్తడం లేదు. అయినా, ముఖ్యమంత్రికి జర్నలిస్టులకు ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ఇంతకాలం ఆలస్యమవుతుందా ? కాళేశ్వరం, యాదాద్రిని యమ జోరుగా నిర్మిస్తున్నట్లే.. జర్నలిస్టులకూ ఇళ్లను నిర్మించి ఇచ్చేసేవారే కదా. అయితే, తాజా విశేషం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి మరో 17 కోట్ల 50 లక్షల రూపాయల నిధులను విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారట. కేవలం అంగీకరించినందుకే సీఎం, కేటీఆర్ లకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మరి, ఈ సొమ్ము అకాడమీ ఖాతాలో ఎప్పుడొచ్చి చేరుతుందో?

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల కార్పస్ ఫండ్ లో భాగంగా ఇప్పటికే 34 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరైంది. తాజాగా, 17 కోట్ల 50 లక్షల రూపాయలు జమ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు సంక్షేమ నిధికి 52 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ సంక్షేమ నిధితో జర్నలిస్టులకు మరింతగా ఉపయోగ పడే విధంగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది.  జర్నలిస్టుల వెంట ఉండి, జర్నలిస్టుల సంక్షేమ నిధికి నిధులు రాబట్టడానికి ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేక కృషి చేశారు. బుధవారం మంత్రి కేటీఆర్తో  మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సమావేశమయ్యారు. జర్నలిస్టుల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 7న జల విహార్ లో జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద ఎంపికైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

#Telangana Mlc Elections 2021

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article