హైదరాబాద్:వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి, వైఎస్సార్‌టీపీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సర కాలంలో తమ పార్టీ ఎంతో పురోగతి సాధించిందని.. తెలంగాణ ప్రజలకు నిజమైన పక్షంగా నిలబడిందని అన్నారు. తాము చేస్తోన్న దీక్షల వల్లే పాలక పక్షానికి బుద్ధి వచ్చిందన్నారు. పార్టీ పెట్టకముందే నిరాహార దీక్ష చేశానని చెప్పిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానన్నారు. ఇప్పటివరకూ 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇంకా కొనసాగిస్తానని, అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఇప్పటివరకూ తమ వైఎస్సార్‌టీపీ అన్ని వర్గాల వారిని చేరుకుందని, తమ పార్టీకి గ్రామగ్రామన హారతులు పట్టారని, జనాలు అక్కున చేర్చుకున్నారని అన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించారని, ఎన్నో సంక్షేమ పథకాలు అందించి కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిపోయారని షర్మిల పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సువర్ణ పరిపాలన అందించారని, సేవ చేస్తూనే చనిపోయారని, అలాంటి వైఎస్సార్‌కు హైదరాబాద్‌లో ఒక్క మెమోరియల్ కూడా లేదని ఆగ్రహించారు. హైదరాబాద్‌లో భూముల విలువ పెంచింది వైఎస్సారేనని, కానీ ఆయన్ను స్మరించుకోవడానికి నగరంలో సెంట్ భూమి కూడా ఇవ్వలేదని, ఇది నిజంగా సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్‌కు గౌరవం ఇవ్వడం లేదని, ఆయన ఇచ్చిన అధికారాన్ని ఇచ్చిన ఆ పార్టీ వైఎస్సార్‌కు ఏం చేసిందని ప్రశ్నించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకంలోనూ ఇందిరా, రాజీవ్ పేర్లను పెడితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన పేరుని ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిందని ఫైరయ్యారు. వైఎస్సార్‌కు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని, ఆ శాపమే ఇంకా కాంగ్రెస్‌ను వెంటాడుతోందని చెప్పారు.కేసీఆర్ కూడా వైఎస్సార్‌కు అన్యాయం చేశారని, వైఎస్సార్ కోసం కేటాయించిన భూమిని సైతం వెనక్కు లాక్కున్నారని షర్మిల ఆరోపించారు. 2004లో టీఆర్ఎస్ బలం ఎంత? అని ప్రశ్నించిన ఆమె.. అప్పుడు కేసీఆర్‌ను వైఎస్సార్ కలుపుకొని తెలంగాణ కోసం పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఓడిపోయిన హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. కానీ.. వైఎస్సార్‌కు కేసీఆర్ ఇచ్చిన గౌరవమేంటి? అని నిలదీశారు. టిఆర్ఎస్ భవన్ ఇచ్చింది కూడా వైఎస్సార్ అని, ఇంగితం లేకుండా ఎందుకు ఆయన కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకున్నారని షిర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని కోపాద్రిక్తురాలైన షర్మిల.. హైదరాబాద్‌లో ఎక్కడో ఒక చోట మెమోరియల్ కోసం స్థలం కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు