అమరావతికి కేసీఆర్ విరాళం?

KCR DONATION TO AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధాలను మరింత పెంచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొరుగు రాష్ట్రానికి అండగా నిలవాలని భావిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి తన వంతుగా సాయం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చక్కని సంబంధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకరి ప్రయోజనాలకు మరొకరు సహకరించుకోవాలని చర్చల సందర్భంగా ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను కేసీఆర్ అడిగిన వెంటనే ఏపీ సీఎం జగన్ తిరిగి ఇచ్చేశారు. అలాగే గోదావరి నదీ జలాల మళ్లింపు విషయంలోనూ కేసీఆర్ తో కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. వీటిపై స్వరాష్ట్రంలో విమర్శలు వస్తున్నా జగన్ పట్టించుకోలేదు. పైగా కేసీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతించారు.

ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి విరాళమివ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది. దాదాపు రూ.100 కోట్ల మేర సాయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. నదీ జలాల విషయంలో సెప్టెంబర్లో ఇరువురూ సమావేశం కావాలని యోచిస్తున్నారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఈ ప్రకటన చేయొచ్చని సమాచారం. వాస్తవానికి 2015 అక్టోబర్ లో అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడే తెలంగాణ తరఫున ఆర్థిక సాయం ప్రకటించాలని కేసీఆర్ భావించారు. అయితే, ఆ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ ఎలాంటి సాయం ప్రకటించకపోవడంతో కేసీఆర్ కూడా మిన్నకుండిపోయారు. ప్రధానే ఏపీకి ఏమీ ఇవ్వని నేపథ్యంలో తాను ఇస్తే ఆయన్ను చిన్నబుచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రకటన చేయకుండా వెనక్కి తగ్గారు. తాజాగా రెండు రాష్ట్రాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సాయం చేయాలని ఆయన భావిస్తున్నారు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article