హలో.. నేను కేసీఆర్ మాట్లాడుతున్నా..

KCR PHONE TO FARMER

  • యువరైతుకు ముఖ్యమంత్రి ఫోన్
  • ఫేస్ బుక్ ద్వారా అతడి సమస్య విని మాట్లాడిన కేసీఆర్
  • గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం

ఓ యువరైతు సమస్య నేరుగా ముఖ్యమంత్రికి తెలిసేలా చేయడంలో ఫేస్ బుక్ కీలక పాత్ర పోషించింది. అతడి సమస్య తెలుసుకున్న సీఎం.. నేరుగా ఆ రైతుకు ఫోన్ చేసి మాట్లాడటమే కాకుండా గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కరించారు. వ్యవసాయ భూమి పట్టాతోపాటు రైతు బంధు చెక్కును కలెక్టర్ స్వయంగా సదరు రైతుకు అందజేశారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతు శరత్‌ తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్‌ మరొకరి పేరుతో పట్టా చేశారని, తాను వెళ్లి అడిగితే పట్టించుకోవడంలేదని తన ఆవేదన వెళ్లగక్కుతూ ఫేస్ బుక్ పేజీలో వీడియో పోస్ట్ చేశాడు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ తన గోడు వినడంలేదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కు ఈ వీడియో చేరేంత వరకు షేర్ చేయాలని కోరాడు.

శరత్ ఈనెల 18న వీడియో పోస్ట్ చేయగా.. అది అలా షేర్ అవుతూ అవుతూ సీఎం కేసీఆర్ కు చేరింది. వెంటనే ఆయన శరత్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అన్ని విధాలా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. వెంటనే మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికెరితో మాట్లాడి రైతు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్, ఇతర అధికారులు ఆగమేఘాల మీద శరత్ ఇంటికి చేరుకున్నారు. అతడి నుంచి వివరాలన్నీ సేకరించారు. బాధ్యతలు సరిగా నిర్వర్తించని వీఆర్వో, ఆర్ఐని సస్పెండ్ చేశారు. అనంతరం ఆ భూమికి సంబంధించిన పట్టాను శరత్ తండ్రి శంకరయ్యకు అందజేశారు. ఇదంతా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. కాగా, రైతుతో మాట్లాడిన కేసీఆర్.. పలు విషయాలు అతడితో పంచుకున్నారు. అలాగే, ఈ సమస్య పరిష్కారంలో తాను తీసుకున్న చర్యలను కూడా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాలని కోరారు. పలుమార్లు ఈ విషయాన్ని శరత్ కు స్పష్టంచేశారు. సమస్య తీరిపోయింది కదా అని పడుకోవద్దని, అందరినీ చైతన్యవంతులను చేయాలని సూచించారు.

TS POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article