రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులు: కేసీఆర్

39
Telangana Aajadi ka Amrut
Telangana Aajadi ka Amrut

#Kcr speeches about Revenue department#

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ధరణిపోర్టల్‌ భారతదేశానికి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. ‘‘ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. సాగువిధానంలో అధునాతన మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశాం. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. ధరణి పోర్టల్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదు. తప్పు చేసే అధికారం నాకులేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. మీ-సేవ, ధరణి పోర్టల్‌, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ధరణి పోర్టల్‌ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేసుకోవచ్చు’’ అని సీఎం వివరించారు.

మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ వీరారెడ్డి 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిలో అగ్రణ్యులని గుర్తు చేశారు. ఆ మహనీయుడు పుట్టిన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించి ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి జైలుపాలైన వ్యక్తుల్లో వీరారెడ్డి ఒకరు’’ అని కేసీఆర్ వివరించారు.

కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ  భూ రికార్డుల ప్రక్షాళన చేపడతామని మూడేళ్ల క్రితం మూడుచింతలపల్లిలోనే సీఎం చెప్పారని గుర్తు చేశారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ధరణి పోర్టల్‌ ప్రారంభించండం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here