మీరే మా ధైర్యం

104
KCR OUT OF DANGER

రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు.
మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎంజీఎం దవాఖానా సమీపంలోనే ఉన్న సెంట్రల్ జైల్ ను తరలించి అక్కడ మాతా శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, విశాలమైన స్థలంలో చర్లపెల్లి ఓపెన్ ఎయిర్ జైలు మాదిరిగా.. జైలును నిర్మిస్తుందనీ సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా చికిత్స అమలు తీరు, వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం హెలీకాప్టర్ లో వరంగల్ చేరుకున్న సీఎం, తొలుత ఎంజీఎం దవాఖానాను సందర్శించారు. ఐసీయూలో, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల ప్రతీ బెడ్డు వద్దకు కలియతిరిగి పేరు పేరునా వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. మందులు, భోజనం సరిగ్గా అందుతున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. మీరంతా త్వరలోనే కొలుకుంటారనీ కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. సీఎం ను ఉద్దేశించి, మీరే మా ధైర్యం.. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం.. అని ఆయన ఉద్వేగంతో నినదించారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు.
ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి పారిశుధ్య పరిస్థితులను, సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దవాఖాన సిబ్బందితో, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ఖైదీలు తయారు చేసిన చేనేత, స్టీలు తదితర ఉత్పత్తులను పరిశీలించారు. బ్యారకుల్లో కలియతిరిగి, శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడారు. వారు జైలుకు ఏ శిక్ష మేరకు వచ్చారు? వారి ఊరు ఎక్కడ? వారి కుటుంబ పరిస్థితి ఏంటిది? అని అడిగి తెలుసుకున్నారు. ఖైదీల సమస్యలను ఓపికతో ఆలకించారు.. జైల్లో వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. వారి అభ్యర్థనలను స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here