Kcr supports Bharat Bandh
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాతటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ వికాస సమితి..
దేశవ్యాప్తంగా డిసెంబర్ 8వ తేదీ న నిర్వహిస్తున్న బంద్ కి తెలంగాణ వికాస సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న రైతులకి సంఘీభావం తెలుపుతున్నాము. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా తెలంగాణ వికాస సమితి నిలుస్తుంది. భారతదేశ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలని రద్దు చేసి రైతులకు మద్దతు ధర కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో దేశానికి అన్నం పెట్టే రైతులపై దాడులను, దమనకాండను ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కావున గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. భారత్ బంద్ ను విజయవంతం చేయడానికి అందరూ స్వచ్ఛందంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర కార్యవర్గంలోని బాధ్యులు సమావేశమై భారత్ బంద్ కు మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.