కనిపిస్తే కాల్చివేత పరిస్థితులు తెచ్చుకోవద్దు

KCR WARNS PEOPLE

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రజలంతా సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. జనం సహకరించని పక్షంలో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టంచేశారు. అమెరికాలో స్థానిక పోలీసుల మాటను ప్రజలు లెక్క చేయకపోవడంతో అక్కడ ఆర్మీని రంగంలోకి దింపారని, అలాంటి పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దని సూచించారు. కరోనాను అరికట్టడానికే కర్ఫ్యూ విధించామని, దీనికి అందరూ సహకరించి ఇంట్లోనే ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు విధించింది సాధారణ కర్ఫ్యూ అని.. కనిపిస్తే కాల్చివేత వంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని స్పష్టంచేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆయన మంగళవారం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు పలువురు అధికారులు కృషి చేస్తున్నారని.. మరి ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారని ప్రశ్నించారు. జంటనగరాల్లో 150 మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మంత్రులు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో ఉండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన వాహనాలను ఈ రాత్రి అనుమతిస్తామని.. అవన్నీ తెల్లవారేసరికి తమతమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఒక్కరోజుకు వాటికి టోల్ మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇకపై ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుందని స్పష్టంచేశారు. షాపులు సాయంత్రం ఆరు గంటలకే మూసివేయాలని, అలా చేయని పక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఉంటే డయల్ 100కి కాల్ చేస్తే, తగిన సహాయం అందుతుందని పేర్కొన్నారు.

TS NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article