నేడే టీడీఎల్పీ మీటింగ్ …కీలక నిర్ణయాలు

Key Decisions in TDLP Meeting

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తిరిగి అధికారం దక్కించుకోవాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అందుకు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్లనుంది. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలే అజెండాగా టిడిఎల్పి సమావేశం జనవరి 31వ తేదీ గురువారం మధ్యాహ్నం జరగనుంది.. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో టిడిఎల్పి సమావేశం నిర్వహించనున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యేల పనితీరు ప్రధానాంశాలుగా సమావేశం జరగనుంది. 2019 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు.. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కీలక సూచనలు చేయనున్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు.. చేయిస్తున్న చంద్రబాబు వారి పనితీరుపై ఓ అంచనాకు వచ్చారు. సుమారు 30 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వారు తమ పద్దతి మార్చుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు వివిధ జిల్లాల్లో పార్టీ పరిస్థితి పై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల పైనా టీడీపీ అధినేత ఫోకస్ పెట్టారు. అవసరమైతే కొంతమంది ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేయనున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేర్పులపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టిడిఎల్పి సమావేశం హాట్ హాట్‌ గా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article