సభలు, సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడకపోతే ఎలా ఉంటుందో ప్రముఖ నటి ఖుష్బూ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతనే ఇరకాటంలో పడేశాయి. బీజేపీ అభ్యర్థిగా తమిళనాడులోని థౌజెండ్ లైట్స్ నియోజకవర్గం ఖుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఆమె.. ఓ ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు మరో బీజేపీ నేతకు ఇబ్బందిగా మారాయి. సభలో ఖుష్బూ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశాడని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో ఖుష్బూ వెనకాల ఉన్న ఓ నేత ఆమె దగ్గరకు వచ్చి.. ‘మేడం.. మీ పక్కనున్న సెల్వమే ఆ ఎమ్మెల్యే’ అని అనడంతో ఆమె అవాక్కయ్యారు. అప్పటివరకు ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు సెల్వం మొహం మాడిపోయింది కూడా. డీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు. ఖుష్బూ ప్రచార సభలో పాల్గొని అలా అడ్డంగా బుక్కయిపోయారు.