హెచ్ఎండీఏను గాలికొదిలేశారా?

ఎట్టకేలకు హెచ్ఎండీఏపై బీజేపీ దృష్టి సారించింది. ఈ విభాగంలో జరుగుతున్న అక్రమాలు, సిబ్బందిలేమి, అధికారుల బాధ్యతారాహిత్యం, అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల గురించి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. హెచ్ఎండీఏను తక్షణమే ప్రక్షాళన చేయాలన్నారు.

667
KISHAN REDDY LETTER TO CM KCR
KISHAN REDDY LETTER TO CM KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఎండీఏను పట్టించుకోవడం లేదని తెలంగాణ బీజేపీ పార్టీకి అర్థమైంది. గతంలో కమిషనర్ జనార్దన్ రెడ్డిని అవమానకర రీతిలో హెచ్ఎండీఏ నుంచి బయటికి పంపేసిన తర్వాత.. ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నే అదనపు కమిషనర్ గా కొనసాగిస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గా బాలక్రిష్ణ వ్యవహరిస్తున్నారు. నగర నిర్మాణ సంస్థల్లో ఈయనకు మంచి పేరుంది. ఎలాంటి అనుమతినైనా అవలీలగా ఇచ్చేస్తారని పలువురు బిల్డర్లు నిత్యం చెప్పుకుంటారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రణాళికాబద్ధంగా పని చేసే హెచ్ఎండీఏ ఆ తర్వాత పట్టాలు తప్పింది. గతంలో హెచ్ఎండీఏ డైరెక్టర్ గా వ్యవహరించిన పురుషోత్తం రెడ్డిని అప్పటి కమిషనర్ చిరంజీవులు పక్కా ప్రణాళికలు రచించి ఆయన్ని అక్కడ్నుంచి తప్పించారని, ఇందుకు మీడియా ను వాడుకున్నారని హెచ్ఎండీఏ వర్గాలు కోడై కూస్తున్నాయి. తెలంగాణకు గుండెకాయ అయిన హెచ్ఎండీఏను గత కొంతకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. లేఖ సారాంశమిదే..

‘‘హైదరాబాద్ మహానగరంతో పాటు నగర పరిసరాల్లో జరగనున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, సుమారు 7257 చ.కి.మీ. విస్తీర్ణంతో చుట్టుపక్కల జిల్లాల్లోని వందలాది గ్రామాలను కలుపుకొని 2008 లోనే ఆనాటి ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరపాలక అభివృద్ధి సంస్థ (హెచ్.ఎం.డి.ఎ) ను ఏర్పాటు చేసింది. తర్వాత హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ని రూపొందించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రభుత్వం, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆశించిన విధంగా ప్రణాళికలు అమలు జరగడం లేదని అనేక ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి.  పరిధి పెద్దగా ఉండడంతో పాటు క్షేత్ర స్థాయిలో సరైన అవగాహన లేక సంబంధిత స్థానిక సంస్థలతో సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ నిర్మాణాలు పెరుగుతూ క్రమ పద్దతిలో జరగవలసిన అభివృద్ధి అక్రమాలకూ, అవినీతికి అవకాశం కల్పిస్తున్నది.  అంతే కాకుండా, రైతులు కూడా మాస్టర్ ప్లాన్ తమకు అనుకూలంగా లేదని – భూములను వివిధ జోన్లుగా మార్చే విషయంలో తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు.  రైతులు తమ భూములను ఇతర జోన్లకు అంటే, నివాస, పారిశ్రామిక, వ్యాపార తదితర జోన్లలోకి మార్చుకోవడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో అక్రమ నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతోంది.  

 • తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను సమీక్షించి, రైతులకు అనుకూలంగా సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ప్రభుత్వం పలుసార్లు చెప్పింది.  ఇది ఖర్చుతో కూడిన పని కూడా కాదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన భూములు తప్ప ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని మిగతా భూములన్నింటినీ నివాస (రెసిడెన్సియల్), జోన్లుగా మారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కావున  హెచ్.ఎం.డి.ఎ సమగ్ర అభివృద్ధికి నా దృష్టికి వచ్చిన పిర్యాదుల / సమస్యల నేపథ్యంలో ఈ క్రింది సూచనలు పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. 
 • హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునః సమీక్షించాలి.
 • హెచ్.ఎం.డి.ఎ – స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. 
 • అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానిక సంస్థలతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలి. 
 • నిర్మాణ అనుమతులకై తీసుకువచ్చిన డీపీఎంఎస్ విధానం సమర్థవంతంగా అమలయ్యేట్టు చూడాలి. 
 • ఘటకేసర్, గౌడవెల్లి, నాగులపల్లి, శంషాబాద్ ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లపై రైల్వే లైన్లు వచ్చిన ప్రదేశాల్లో బ్రిడ్జ్ లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి.  
 • అన్ని రేడియల్ రోడ్లను పూర్తి చేయాలి. 
 • రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, పటాన్చెరు, శంబీపూర్ తదితర ప్రాంతాలలో సర్వీస్ రోడ్లను పూర్తిచేయాలి. 
 • ప్రధాన రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి. 
 • ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న ప్రతి సూచికపై దూరాన్ని సైతం చూపించాలి. 
 • ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్లపై చెట్లు పెంచడం, పొదలను తొలగించడం సరైన పద్ధతిలో చేయాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here