మొన్న మహేశ్వరం.. నేడు కోకాపేట్?

Kokapet Land Auctions Going To Hit Badly

2008లో వచ్చిన ఆర్థిక మాంద్యానికి ఒక్కసారిగా మహేశ్వరంలో ప్లాట్ల ధరలన్నీ దారుణంగా పడిపోయాయి. అప్పటివరకూ చదరపు గజానికి రూ.10 వేలు పలికిన ప్రాంతంలో ఐదు వేలకు అమ్ముదామంటే ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. కొందరైతే గజానికి 2 నుంచి 3 వేలకు అమ్ముకున్న సందర్భాలున్నాయి. ఇక, మరికొందరు తమ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా మర్చిపోయి ఉంటారు. అస్సలు అక్కడ ప్లాటు ఉందనే విషయం గురించి వారికి గుర్తు ఉండకపోవచ్చు. ఇప్పుడు మళ్లీ 2019లో మాంధ్యం ఏర్పడింది. మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఏ ప్రాంతం కుప్పకూలుతుందని ప్రశ్నిస్తే.. ప్రతిఒక్కరికీ కోకాపేట్ గుర్తుకొస్తుంది. ఎందుకంటారా?

ఇటీవల కాలంలో కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి.  ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కోట్లు పలుకుతున్నది. దీంతో, చాలామంది ద్రుష్టి ఈ ప్రాంతం మీదే పడింది. ఇక, తాజాగా హెచ్ఎండీఏ కోకాపేట్లో భూములు వేలం వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎకరానికి రూ.30 కోట్లు చొప్పున కొన్ని భూముల్ని అమ్మాలని ప్రణాళికలను రచిస్తోంది. ఐదు ఎకరాల చొప్పున సుమారు పద్దెనిమిది బిట్లు చొప్పున అమ్మడానికి ప్రణాళికలు రచిస్తుందని తెలిసింది. అయితే, ప్రస్తుతం మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో కోకాపేట్లో ఎకరానికి రూ.30 కోట్లు పెట్టి ఎవరైనా స్థలం ఎందుకు కొనుగోలు చేస్తారు? ఎకరానికి రూ.30 కోట్లు అంటే గజానికి రూ.లక్ష పడుతున్నట్లు లెక్క. 4840 గజాల్లో నుంచి 1840 గజాలు మినహాయించి లెక్కిస్తే.. గజానికి లక్ష అవుతుంది. కానీ, అక్కడేమో గజానికి ప్రస్తుతం రూ.50,000 పలుకుతున్నది. ప్రస్తుతం మాంద్యం నేపథ్యంలో, ఇప్పటికే ఎంతో కొంతకు అమ్ముకోవడం మీద రియల్టర్లు ద్రుష్టి సారిస్తున్నారు. వీలైనంత తొందరగా అమ్ముకుని బయటపడాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోకాపేట్లో వేలం పాట నిర్వహిస్తే ఎంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి స్థలం కొనే అవకాశం ఉంటుంది? ఇప్పటికే వారందరికీ స్టేట్ సీన్ అర్థమైంది. ఒకవేళ, ఎవరైనా ధైర్యం చేసి ముందుకొచ్చి ఎకరానికి రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసినా.. చివరికీ డీఎల్ఎఫ్ మాదిరిగా దివాళా తీసే పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. పైగా, 111 జీవో ఎత్తేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో, ఎవరైనా ఎకరాకు రూ.2-3 కోట్లు దొరికే ప్రాంతంలో కొంటారు తప్ప.. 30 కోట్లు పెట్టి ఎందుకు కొంటారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏదీఏమైనా, ఎకరానికి రూ.30 కోట్లు పెట్టి వేలం పాటల్ని నిర్వహిస్తే.. ప్రస్తుతమున్న మాంద్యం పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉందని తెలంగాణ రాష్ట్రం చెప్పకపోయి ఉంటే, ఇతర రాష్ట్రాల మాదిరిగా నోరు మెదపకుండా ఉండి ఉంటే పెద్దగా నష్టమేం వచ్చేది కాదని అధికశాతం విశ్లేషకులు అంటున్నారు. ఏదీఏమైనా, మాంద్యం పేరు చెప్పి తెలంగాణ బ్రాండ్ విలువను పోగొట్టుకునే ప్రయత్నం ప్రభుత్వమే చేసిందని.. ఈ విషయంలో మాత్రం సెల్ఫ్ గోల్ కొట్టుకుందని అభిప్రాయపడేవారున్నారు. మరి, కోకాపేట్లో భూముల వేలం కథ ఎక్కడికి చేరుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article