KTR FIRED ON CHANDRABABU
- దమ్ముంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలి
- డేటా చోరీ విషయంలో ఏపీ సీఎంకు కేటీఆర్ సవాల్
డేటా చోరీ విషయంలో ఎలాంటి తప్పూ చేయకుంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని, వారి అనుమతి వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. ఆయన సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఐటీ గ్రిడ్స్ మీద విచారణ చేపడితే టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ హస్తం లేదని, ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీ చేసిందన్న ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు స్పందించారని ఆయన వెల్లడించారు. ‘‘అమరావతికి ఓ అమెరికా పౌరుడు వచ్చి పర్సు పోగొట్టుకుంటే అమరావతిలో ఫిర్యాదు చేయాలా? అమెరికాలో ఫిర్యాదు చేయాలా? ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందని ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే తెలంగాణ పోలీసులు చర్యలు చేపడితే తప్పేంటి? అసలు ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి’’ అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తున్నారని, ఐటీ చట్టం ప్రకారం విచారణ జరుపుతున్నారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజల డేటాతో ఏం అవసరం.. సానుభూతి కోసమే సీఎం చంద్రబాబు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. డేటా చోరీ కేసులో చంద్రబాబు తప్పుచేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కొవాలని సవాల్ చేశారు. (ఏపీలో భారీగా డేటా చోరీ)
ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ శాసనసభ్యులను ఎంతకు కొన్నారో సీఎం చెప్పాలి అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు గిరిజన సంక్షేమం కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారని, అవసరమైతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఉత్తమ్ వీటిని పట్టించుకోకుండా తెరాసపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. రాహుల్, ప్రియాంక సమక్షంలో యూపీలో భాజపాకు చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ చేరారని, దానిపై మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఎంతకు కొన్నారు? టీడీపీకి చెందిన రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పుడు ఎంత ఇచ్చారు? అని ప్రశ్నించారు.