ఐస్ అమ్మిన వ్యక్తికి కేటీఆర్ సాయం

KTR HELPS ICE GOLA MAN

  • ఇల్లు, వృద్ధాప్య పింఛను మంజూరు చేయిస్తానని హామీ

30 ఏళ్ల క్రితం తాను అబిడ్స్ గ్రామర్ హైస్కూల్ లో చదువుకునేటప్పుడు స్కూలు ముందు ఐస్ గోలా అమ్మిన సయ్యద్ అలీ అనే వ్యక్తి దీనగాథకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. ఆయన్ను అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల కేటీఆర్‌కు మహబూబ్‌ అలీ అనే యువకుడు ట్విటర్‌లో సయ్యద్‌ అలీ గురించి తెలిపారు. ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని, దాన్ని నిజం చేయాలని కోరారు. ఇందుకు తప్పకుండా ఆయన్ను కలుస్తానని కేటీఆర్ గతనెల 25న బదులిచ్చారు.

ఈ నేపథ్యంలో గురువారం సయ్యద్‌ అలీని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇంటికి రాగానే సయ్యద్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశారు. ఇంకా ఐస్‌ గోలా అమ్ముతున్నావా? కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? అని వాకబు చేశారు. తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని, గత సంవత్సరమే గుండెకు శస్త్రచికిత్స జరిగిందని అయినా కుటుంబం కోసం ఇంకా అబిడ్స్‌ గ్రామర్‌ స్కూలు వద్ద ఐస్‌ గోలాలు అమ్ముతున్నానని చెప్పారు. ఆయన గాథ విన్న కేటీఆర్ వెంటనే స్పందించారు. సయ్యద్ కు ఇల్లు, వృద్ధాప్య పింఛను మంజూరు చేయిస్తానని.. కుమారులకు కూడా సరైన ఉపాధి చూపిస్తానని మాట ఇచ్చారు. ఆ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఆయన స్పందన చూసి సయ్యద్‌ ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ గురించి చాలా విన్నానని, ఆయనను ఇలా కలుస్తానని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article