ktr discussions with jagan
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జమానాలో కేసీఆర్ పలికిన ఈ మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. అప్పట్లో వైఎస్సార్, కేసీఆర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వాస్తవానికి, మొదట్లో ఈ ఇద్దరూ కలిసే ఎన్నికల్లో పోటీ చేసినా, అధికారంలోకి రాగానే వైఎస్సార్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తెరాసకు ఏమాత్రం విలువ లేకుండా చేశాడు. ఆ పార్టీని నిట్టనిలువునా చీల్చాడు. కేసీఆర్ అంటే చిన్నచూపుగా చూసేవాడు. రెండోసారి, తెదేపాతో పోటీ పెట్టుకున్న కేసీఆర్ రెండోసారి వైఎస్సార్ చేతిలో ఓడిపోయాడు. అంటే, అప్పట్లో తెదేపా, తెరాస వంటి పార్టీలతో కూడుకున్న కూటమి.. పీఆర్పీ పుణ్యమా అంటూ అధికారంలోకి రాకుండా చతికిలపడింది. అయితే, వైఎస్సార్ మరణించిన తర్వాతే తెరాసకు సరికొత్త ఊపు లభించింది. కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడు ఎవరూ లేకపోయారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మనసును కేసీఆర్ చూరగొన్నారు. అందుకే, రెండోసారి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా జాతీయ స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో, మళ్లీ జగన్‌తో కేసీఆర్ కలవాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న వైఎస్సార్ కుమారుడు జగన్‌తో కలవడానికి కేసీఆర్ ఆసక్తి చూపించడం విశేషం. అందుకే, రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు ఉండరనే విషయం మళ్లీ రుజువైంది. వాస్తవానికి, తెరాస సీఎం కేసీఆర్‌తో ముందునుంచీ జగన్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించడం.. జగన్‌తో కేటీఆర్ బృందం భేటి కావడం.. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పార్టీలు కలిసి జాతీయ రాజకీయాలపై చర్చిస్తాయా? మరే ఇతర విషయాలపై చర్చిస్తాయా? అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.