మోడీ పాలనలో వంట గదుల్లో మంట

  • గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ

•    “మోడీ” పాలనలో వంట గదుల్లో మంట

•    మోనార్క్ మోడీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్ లు తలకిందులు

•    ధరలను పెంచి దేశ ప్రజలపై దొంగ దాడి చేస్తున్న బీజేపీ ప్రభుత్వం

•    ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం

•    గ్యాస్ బండ ధర పెంపుపై నిరసన చేపట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు

•    కేంద్ర ప్రభుత్వ అసరమర్థ పాలన విధానాలపై నిరంతర పోరు

గడియకోసారి పెరుగుతన్న గ్యాస్ ధరతో దేశప్రజలకు గుండె దడ వస్తుందన్నారు  మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు. ప్రధానమంత్రి మోడీ ఆస్తవ్యస్తఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుట్టిందని ఆరోపించారు. 8 సంవత్సరాల అసమర్థ మోడీ పరిపాలనలో సుమారు 170% పెంపుతో, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు. తాజాగా పెంచిన 50 రూపాయలతో ఈ  ఏడాది కాలంలోనే 244 రూపాయల మేర గ్యాస్ బండ రేటును పెంచిన మోడీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 410 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర ఈ రోజు సుమారు మూడు రెట్లు పెరిగి 1100 రూపాయలు దాటడం దురదృష్టకరమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1100పైగా రూపాయలకు గ్యాస్ రేటు చేరడం బిజెపి అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు. “ధరేంద్ర మోడీ” హయాంలో సిలిండర్ బండ ధరలతో పేదల్ని బాదే కార్యక్రమం అడ్డూ అదుపు లేకుండా సాగుతుందన్నారు. రాయితీకి రాం రాం చెప్పి..సబ్సిడీ ఎత్తేసి దేశ ప్రజలపై మోడీ దొంగ దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

నానాటికి రూపాయి విలువ తగ్గిపోతుంటే… మరోవైపు అడ్డూఅదుపు లేకుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయన్నారు కేటీఆర్. చుక్కలనంటుతున్న నిత్యావసరాల రేట్లతో ప్రతీ భారతీయ కుటుంబ బడ్జెట్ భారంగా మారిందన్నారు. బిజెపి అసమర్థ విధానాలతోనే ప్రజలకు అవసరమైన ప్రతీ వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుందని అయినా కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదన్నారు. దేశ ప్రజలతో కష్టాలతో సంబంధం లేకుండా పాలిస్తున్న మోడీ రాజ్యంలో భరించలేని విధంగా ధరలు పెరిగాయన్న కేటీఆర్, కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోయాయని తెలిపారు.  మోడీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రజల రక్తాన్ని పెరుగుతున్న ధరల పేరుతో పీల్చి పిప్పి చేస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై గొంతు చించుకున్న నరేంద్ర మోడీతో పాటు బిజెపి నాయకులంతా ఇప్పుడు తేలు కుట్టిన దొంగల లెక్క గప్ చుప్ అయ్యారని కేటీఆర్ చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భగ్య పాలనకు నాయకత్వం వహిస్తున్న మోడీ, ధరలతో దేశ ప్రజలపై దండయాత్ర చేయడం, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరచడాన్నే సుపరిపాలనగా భావిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article