మాగంటి టీం భూ దందా బోరుబండలో ఓ వ్యక్తి సూసైడ్
హైదరాబాద్ పరిధిలో ఓ ఎమ్మెల్యే అనుచరుల భూ దందా వెలుగులోకి వచ్చింది. సెల్ఫీ వీడియోతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ దందా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుల భూదందాకు ఓ నిండు ప్రాణం బలి అయ్యింది. మాగంటి అనుచరులు తనను మోసం చేసి తన భూమిని అక్రమంగా లాక్కొని.. తిరిగి తనకే అమ్మి డబ్బుల కోసం వేదిస్తున్నారని బోరబండకు చెందిన శ్రీనివాస్ గౌడ్ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
గోపీనాథ్ రైట్ హ్యాండ్ ప్రశాంత్, సాయి చరణ్, రాజు అనే వ్యక్తులు తమ భూసమస్యను ఆసరా చేసుకొని.. భూమి కొంటామని నమ్మబలికారని తెలిపాడు శ్రీనివాస్ గౌడ్. 18 లక్షల రూపాయలకు రెండు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకొని కొనుగోలు చేసి.. మొదట లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారని అన్నాడు శ్రీనివాస్ గౌడ్. ముందస్తుగా ఇస్తానన్న లక్ష ఇవ్వకపోగా.. కేవలం 30 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని వాపోయాడు.
అయితే, భూమి కొనుగోలు చేసి ఏడేళ్లు అయ్యిందని.. అయినా తమ భూమి సొమ్ము తమకు ఇవ్వకుండా తిరకాసు మాటలు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ వాపోయాడు. 7 ఏళ్ల తరువాత డబ్బులు అడుగగా.. 9 లక్షలు ఇస్తామని అనడంతో.. వాగ్వాదానికి దిగడంతో.. తనపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించారని తెలిపాడు. ఇప్పడు భూమి రిజిస్ట్రేషన్ తమపై ఉందని నీ ఇష్టం ఉంటే తీసుకో లేదంటే 9 లక్షలు ఇస్తాం తీసుకోమని అన్నారని వాపోయాడు. లేదంటే మా భూమి వేరొకరికి అమ్ముతామని బెదిరించినట్టు తెలిపాడు శ్రీనివాస్ గౌడ్. దీంతో చేసేది లేక తమ భూమి తామే ఒక్కో ప్లాట్‌కు 22 లక్షల 50 వేల రూపాయల చొప్పున రెండు ప్లాట్లకు 45 లక్షలకు కొనుక్కోవడానికి కూడా ఒప్పుకున్నామని తెలిపాడు.
ఇందు కోసం 8 లక్షల రూపాయలు కూడా ముందస్తుగా ముట్టజెప్పామని తెలిపాడు. అయితే, మిగతా సొమ్ము కోసం తమను వేదిస్తున్నారని.. కొంత సమయం కావాలని అడిగినా.. ఒప్పుకోకుండా తనపైనే కేసు పెడతానని బెదిరిస్తున్నారని అన్నాడు శ్రీనివాస్ గౌడ్. దీంతో మనస్తాపానికి గురై చనిపోతున్నట్టు తెలిపాడు. సీఎంగారూ ఎమ్మెల్యే అండతో తమను సర్వనాశనం చేసిన ప్రశాంత్ ఎస్సీ, ఎస్టీ కేసు పెడుతామని బెదిరించి.. వేదించడంతో చనిపోతున్నానని.. తన ఆత్మహత్యకు కారణం అయిన ప్రశాంత్, రాజు, సాయిచరణ్‌లను కఠినంగా శిక్షంచాలని శ్రీనివాస్ గౌడ్ కోరాడు.