మేధావులు చెప్తే వినే సంస్కారం ప్రధానులకు ఉండేది!

మేధావులు చెప్తే వినే సంస్కారం ప్రధానులకు ఉండేది!

సీఎం కేసీఆర్ ఫైర్

అప్పట్లో ఎవరు మంచి చెప్పినా వినే సంస్కారం ప్రధాన మంత్రులకు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి అమెరికా వెళ్లారు. అప్పుడు ఐసెన్ హోవర్ ఆ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎస్కే డే అనే వ్యక్తిని నెహ్రూకు పరిచయం చేశారు. ఈయన కూడా మీ భారతీయుడే.. అమెరికాకు చాలా అద్భుతమైన సేవలు అందించారు అని హోవర్ పరిచయం చేస్తే.. నెహ్రూ మరుసటి రోజే ఎస్కే డేను భోజనానికి రావలసిందిగా ఆహ్వానించారు.

ఆయన వచ్చినప్పుడు భారత్‌కు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎస్కే డే వంటి మేధావులు పరాయి దేశాల్లో ఉండిపోతే.. భారత్ పరిస్థితి ఏంటని? ఆవేదన వ్యక్తం చేశారు నెహ్రూ. ఆయన్ను భారత్ వచ్చేయాలని పిలిచారు. దానికి డే నిరాకరించారు. ఎందుకు? మీకు దేశంపై ప్రేమ లేదా? అని నెహ్రూ ప్రశ్నించగా.. మీ ప్రాధాన్యతలు సరిగా లేవని కరాఖండీగా చెప్పేశారు డే. దేశంలో ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు, నదీజలాలు వృధా అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు మాత్రం మొదటి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిచ్చారు అంటూ డే విమర్శించారు.

దాంతో రెండో పంచవర్ష ప్రణాళికలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం ఎస్కే డే స్వదేశానికి వచ్చినప్పుడు రాజ్యసభ మెంబర్‌ను చేసి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆయన్ను మంత్రిగా నియమించారు. ప్రజల విశాలమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకునేవారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం పోయి, ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. దీంతో ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రులను దానిలో భాగస్వాములు చేసి, భారతదేశ రూపురేఖలు మార్చేస్తామని, ఇదొక టీమిండియా అని చెప్పడంతో చాలా సంతోషించా. ఇక్కడకు వచ్చిన తర్వాత మంత్రులతో కూడా ఇదే విషయం చెప్పి ఆనందం వ్యక్తం చేశా’’ అని కేసీఆర్ చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article