బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహరం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు కేవలం పోలీసులకే పరిమితం అయిన ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో లింగయ్య రెండు ఫోన్ నంబర్లను ట్యాప్ చేయించినట్టు అధికారులు గుర్తించారు. ఆయనతో మరో ఇద్దరు నేతలకు సైతం నోటీసులిచ్చారు. అయితే, అనూహ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రత్యక్షమయ్యాడు. కొంతసేపు ఆయన పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాడు. దాదాపు రెండు గంటల తర్వాత బయటకు వచ్చాడు. దీంతో ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు వచ్చాడా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జూబ్లీహిల్స్ పీఎస్‌కు లింగయ్య
మాజీ ఎమ్మెల్యే లింగయ్య, ఆయన అనుచరులు ఇచ్చిన నంబర్లను అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్న ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. వీరు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ల ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్టు నిర్దారించారు. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఎయిర్ టెల్ నుండి రిపోర్టు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే లింగయ్యతో పాటూ వీరిద్దరినీ గురువారం విచారణకు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య హాజరయ్యాడు. ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఏసీపీ వెంకటగిరి విచారణ మొదలుపెట్టారు. విచారణ తరవాత ఎలాంటి నిజాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయన్న చర్చ మొదలైంది. అయితే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వమైనా చేస్తుందని సాధారణ విషయమని చెప్పడం తెలిసిందే.