LOKESH MET RK
- ఆర్కేతో లోకేశ్ కరచాలనం
- ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు
వారిద్దరూ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు పోటీ పడ్డారు. విమర్శలు సంధించుకున్నారు. ఎన్నికలు ముగిశాక ఒకరు గెలిచారు. మరొకరు ఓడిపోయారు. తాజాగా ఆ ఇరువురూ ఒకరికొకరు తారసపడ్డారు. పాత విషయాలన్నీ మరచిపోయి.. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఉప్పూ, నిప్పూల వ్యవహరించిన వారిద్దరూ ఇలా చేయడంతో అది వైరల్ అయింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఎంతగా అందరి దృష్టీ ఆకర్షించిందో తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగడంతో అందరూ మంగళగిరి ఫలితంపై ఆసక్తి కనబరిచారు. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో తెలుగుదేశం విచ్చిలవిడిగా డబ్బు కుమ్మరించింది. నగదుతోపాటు వస్తురూపేణా గిఫ్ట్ లు కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగింది. ఇక చోటా నేతలకైతే పంట పండింది. వంద ఓట్లను ప్రభావితం చేయగలిగిన చిన్న నేతకు సైతం ఎనలేని ప్రాధాన్యం దక్కింది. అయితే, ఇంత కష్టపడినప్పటికీ లోకేశ్ విజయం సాధించలేకపోయారు. వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గెలుపొందారు. ప్రచారం సందర్భంగా లోకేశ్, ఆర్కేల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మంగళవారం ఇరువురూ తొలిసారిగా తారసపడ్డారు. మండలి సమావేశానికి లోకేశ్ వెళుతుండగా.. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆర్కే కనిపించారు. దీంతో లోకేశ్ ఆయన వద్దకు వచ్చి, ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు అంటూ చేయి చాచారు. ఆర్కే కూడా లోకేశ్ తో కరచాలనం చేశారు. ఎన్నికల ప్రత్యర్థులు ఇలా ఆత్మీయంగా పలకరించుకోవడంతో అక్కడున్నవారు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.