LOKSABHA ELECTION SHEDULE
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. మే మొదటి వారానికల్లా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్ విడుదల చేయడానికి వీలుగా కసరత్తు చేస్తోంది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. గత ఎన్నికల షెడ్యూల్ తరహాలో కాకుండా మొత్తం ప్రక్రియం నెల రోజుల లోపే ముగించేసేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యుల్ విడుదల చేయడం దాదాపుగా ఖరారైందని, తేదీ ఎప్పుడనేది ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్లోనే ఐదు విడతలుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తొలి రెండు విడతల్లో ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, జమ్ముకాశ్మీర్‌తో పాటు ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసేలా షెడ్యుల్ రూపొందిస్తోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, మూడో వారంలో ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. మొత్తమ్మీద ఫిబ్రవరిలో ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తోంది.