ఎక్కువసేపు కూర్చుంటే అకాల మరణమే

Long Time Sitting Idle May Threat to Life
· వ్యాయామం చేస్తున్నా ఎక్కువసేపు విశ్రాంతి వద్దు

· అదేపనిగా కూర్చుని ఉంటే గుండెకు ముప్పు

· తాజా అధ్యయనంలో వెల్లడి

ఆఫీసు లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఉదయాన్నే వ్యాయామం చేస్తున్నాం కదా.. కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నారా? అలా చేస్తే మీ గుండె చిక్కుల్లో పడ్డట్టే. ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కడైనా సరే ఎక్కువసేపు కూర్చుని ఉండేవారికి రిస్కు తప్పదని తేలింది. రోజూ ఎక్సర్ సైజ్లు చేస్తున్నప్పటకీ, ఎక్కువ సేపు కూర్చుని ఉంటే యమ డేంజరేనని వెల్లడైంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసినా, లేదా ఏ పనీ చేయకుండా బడలికగా విశ్రాంతి తీసుకుంటున్నా అది అకాల మరణానికి దారితీస్తుందని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తెలిసింది. రోజుకు గంట నుంచి గంటా 15 నిమిషాలపాటు వ్యాయామం చేస్తున్నవారు కూడా రోజుకు సరాసరి 12.30 గంటలపాటు పెద్దగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని పనిచేసినా.. లేదా ఇందులో కొన్ని గంటలు పనిచేసి, మరికొన్ని గంటలు బడలికగా విశ్రాంతి తీసుకున్నా ప్రమాదమేనని అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువట. ఇది వయసుతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులిద్దరికీ వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో గుండె పనితీరు ఎలా ఉంటుందనే విషయంపై అధ్యయనకర్తలు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా 45 ఏళ్లు దాటిన అన్ని వయస్కుల వారిని దాదాపు 8వేల మందిని ఎంచుకున్నారు. అనంతరం వారి జీవన శైలిని, శారీరక శ్రమను, వారి శరీరంలో వస్తున్న మార్పులను నాలుగేళ్లపాటు క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్దారణకు వచ్చారు. అంతగా శారీరక శ్రమ లేనివారు కచ్చితంగా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శారీరక శ్రమ అంటే రాళ్లెత్తడం, చెట్లు కొట్టడం కాదని.. శరీరం కదులుతూ ఉంటే చాలని చెబుతున్నారు. పనిచేసే చోట ఆఫీసయినా, ఇళ్లయినా అదే పనిగా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడడం, నడవడం వంటివి చేయాలని, తద్వారా కొద్ది మేర అయినా రాబోయే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అధ్యయనకర్తలు పేర్కొంటున్నారు.

women health tips

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article