Lover Day movie failed in box office
కోట్లు ఖర్చు పెట్టినా గుర్తింపు రావడం చాలా కష్టం.. కాని కొన్ని సందర్భాలేమో చిన్న పనికే చాలా పెద్ద గుర్తింపు దొరుకుతుంటుంది. ఈ రెండో కోవలో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. తొలి సినిమా `ఒరు ఆడార్ లవ్` అనే మలయాళ సినిమా. ఆ సినిమాలోని ఓ కన్నుగీటే సన్నివేశం విడుదలై ఈమెకు పెద్ద స్టార్ రేంజ్ గుర్తింపును తెచ్చిపెట్టింది. తొలి సినిమా విడుదల కాకుండానే మన దర్శక నిర్మాతలు ప్రియా ప్రకాష్‌తో సినిమాలు చేయడానికి సిద్ధమైపోయారు. అలాంటి వింక్ స్టార్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన `ఒరు ఆడార్ లవ్`ను.. ఆమెకున్న క్రేజ్ కారణంగా మలయాళంలో పాటు తెలుగు, తమిళంలో అనువాదం చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఈ చిత్రం `లవర్స్‌డే`గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రియా ప్రకాష్ వారియర్ ఎలా మెప్పించింది?.. అసలు లవర్స్ డే లో ప్రియా ప్రకాష్ రోల్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
బ్యానర్: సుఖీభవ సినిమాస్
నటీనటులు: ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్, రోషన్, మాథ్యూ జోసఫ్, వైశాఖ్ పవనన్, మైఖేల్ యాన్ డేనియల్, దిల్‌రూపా, హరీష్ పెరుమన్న, అనీష్ జి మీనన్, షాన్ సాయి, అర్జున్ హరికుమార్, అతుల్ గోపాల్, రోష్న అన్‌రాయ్ తదితరులు
కెమెరా: శీను సిద్ధార్థ్
ఎడిటింగ్: అచ్చు విజయన్
సంగీతం: షాన్ రెహమాన్
స్క్రీన్‌ప్లే: సారంగ్ జయప్రకాష్, లిజో పనాడా
కథ, దర్శకత్వం: ఒమర్ లులు
నిర్మాతలు: ఎ. గురురాజ్, సి.హెచ్. వినోద్‌రెడ్డి
కథ:
ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్, గాథ, మాథ్యూ.. వీళ్లందరూ క్లాస్‌మేట్స్. సైన్స్ స్టూడెంట్స్. ప్రియా, రోషన్ మధ్య సరదా సాగిన పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. దానికి గాథ సపోర్ట్ చేస్తుంది. అంతా బాగానే సాగుతున్న క్రమంలో రోషన్ ఫోన్ నుంచి వాట్సాప్‌లోకి కొన్ని అశ్లీల చిత్రాలు అప్‌డేట్ అవుతాయి. అవి రోషన్ చేయకపోయినప్పటికీ, అతని ఫోన్ నెంబర్ ఉండటంతో అందరూ అతన్ని దోషిగా చూస్తారు. ప్రియా అయితే ఆ సన్నివేశంతో బాగా డిస్టర్బ్ అయి అతనికి బ్రేకప్ చెబుతుంది. అయితే వారిద్దరిని కలపాలని స్నేహితులు ఓ ఆలోచన చేస్తారు. ఆ నేపథ్యంలోనే రోషన్, గాథ మధ్య ప్రేమ ఉన్నట్టు నటించమంటారు. ఆ నటన ఒకానొక దశలో నిజంగా మారుతుంది. అయితే ఒకరి మీద ప్రేమను మరొకరికి చెప్పుకోరు. గాథతో చెప్పలేని ఆ విషయాన్ని ఓ సందర్భంలో ప్రియతో చెప్పేస్తాడు రోషన్. అయితే చివరికి ఏమైంది? రోషన్‌ని గాథ ఎలా చూసింది? అతని మీద ప్రేమ పెంచుకుందా? లేకుంటే స్నేహితుడిగానే ట్రీట్ చేసిందా? వారిద్దరి ప్రేమ సఫలమైందా? విఫలమైందా? అనేది కథ.
ప్లస్ పాయంట్లు
– నటీనటులు నటన
– కొన్ని సరదా సంఘటనలు
– క్లైమాక్స్
మైనస్ పాయింట్లు
– కొత్తదనంలేని కథ, కథనం
– బోర్ కొట్టిన తొలి సగం
– ఎమోషన్స్ లేకపోవడం
– డబ్బింగ్ మూసగా ఉండటం
సమీక్ష
మలయాళ సినిమాలు నేచురాలిటీకి దగ్గరగా ఉంటాయి. తెలుగు సినిమాలు నేచురాలిటీని మించిన డ్రామాను కలగలుపుకుంటాయి. మలయాళంలో కోట్లు కుమ్మరించిన సినిమాలు కూడా తెలుగు లో బాక్సాఫీస్ దగ్గర చతికిల పడటానికి ఇది ప్రధాన కారణం. ఇంకో ముఖ్యమైన విషయం విషాదాంతాలను చూడటానికి తెలుగు ప్రేక్షకులు పెద్దగా
ఇష్టపడరు. అందులోనూ `లవర్స్ డే` అని పేరున్న సినిమాలో విషాదాంతాన్ని ఊహించరు. పతాక సన్నివేశాల్లో కొన్ని నిమిషాలు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిన దర్శకుడు ముందు నుంచీ ఆ ప్రయత్నమే చేసి ఉంటే బావుండేది. పైగా పబ్లిసిటీ మొత్తం ప్రియా ప్రకాష్ వారియర్ మీద నిర్వహించి, సినిమాలో ఆమెది క్యారక్టర్‌ని సైడ్ చేయడాన్ని కూడా ఎవరూ పెద్దగా అంగీకరించరు. కన్నుకొట్టి, గన్ను పేల్చిన సీన్లు సినిమాలోనూ పెద్ద హైలైట్ అయింది ఏమీ లేదు. ప్రియ కన్నా నూరిన్ ఒక పిసరు బాగా నటించింది. స్క్రీన్ మీద చలాకీగా కనిపించింది. రోషన్ కి నటనలో పెద్దగా మార్కులు పడవు. కాలేజీలో సీనియర్ల, జూనియర్ల గొడవలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి
రేటింగ్: 1.5
బాటమ్ లైన్: విషాదాంతంగా `లవర్స్ డే`