మూడేళ్ల బాబుకు ఊపిరితిత్తుల కేన్స‌ర్

34
Lung cancer for three year old boy
Lung cancer for three year old boy
  • దానికితోడు ఎప్‌స్టీన్ బార్ వైర‌స్ కూడా*
  • క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రిలో విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స‌*
  • నిరుపేద బాలుడికి ప్రాణ‌దానం*

క‌ర్నూలు, సెప్టెంబ‌ర్ 14, 2021: అభం శుభం తెలియ‌ని మూడేళ్ల వ‌య‌సు.. అంత‌లోనే ఊపిరాడ‌క ఇబ్బంది. ఏం జ‌రుగుతోందో కూడా ఆ త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌లేదు. తిర‌గ‌ని ఆస్ప‌త్రి లేదు. అయినా ఫ‌లితం లేదు. చివ‌ర‌కు క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. అక్క‌డ చూపిస్తే, బాబుకు అత్యంత అరుదైన ఊపిరితిత్తుల కేన్స‌ర్ అని తేలింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సలావుద్దీన్, షహీదా బాను దంప‌తుల కుమారుడు మ‌హ్మ‌ద్ రెహాన్. త‌ల్లిదండ్రుల‌ది నిరుపేద నేప‌థ్యం. రెహాన్ తండ్రి స్కూలు బస్సు డ్రైవరుగా ప‌ని చేస్తారు. రెహాన్ దాదాపు ఏడాది నుంచి ఊపిరి స‌రిగా అంద‌క ఇబ్బంది ప‌డుతున్నాడు. వేర్వేరు ఆసుప‌త్రుల‌కు తిరిగినా, అక్క‌డేవో మందులు ఇచ్చారు త‌ప్ప‌, స‌మ‌స్య ఏంట‌నేది గుర్తించ‌లేదు. ఆ స‌మ‌యంలో క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రికి తీసుకురాగా, క‌న్స‌ల్టెంట్ పీడియాట్రిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఎం.శ్రీ‌కాంత్‌బాబు సీటీ గైడెడ్ బ‌యాప్సీ ద్వారా ప‌రీక్షించారు. ఆ ప‌రీక్ష‌ల‌లో రెహాన్ కుడివైపు ఊపిరితిత్తుల్లో అత్యంత అరుదైన కేన్స‌ర్ ఉన్న‌ట్లు తేలింది. దాన్ని వైద్య‌ప‌రిభాష‌లో ప్లూరోప‌ల్మ‌న‌రీ బ్లాస్టోమా అంటారు. అప్ప‌టికే కేన్స‌ర్ బాగా లోప‌ల‌కు వెళ్లింది. దాంతో వెంట‌నే ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించారు. రైట్ అప్ప‌ర్ లోబెక్ట‌మీ అనే శ‌స్త్రచికిత్స‌తో లోప‌లున్న కేన్స‌ర్ క‌ణితి మొత్తాన్ని తొల‌గించారు. తొల‌గించిన క‌ణితిని మ‌రోసారి బ‌యాప్సీకి పంప‌గా, అది లింఫోమ‌టాయిడ్ గ్రాన్యులోమ‌టోసిస్ అనే మ‌రో ర‌కం కేన్స‌ర్‌గా గుర్తించారు. అంటే, లింఫ్‌నోడ్ల‌లోకి కూడా కేన్స‌ర్ వ్యాపించింది. బి-క‌ణాల్లోనూ ఉన్న‌ట్లు క‌నిపించింది. వీట‌న్నింటికీ తోడు ఎప్‌స్టీన్ బార్ వైర‌స్ అనే అరుదైన వైర‌స్ కూడా బాబుకు సోకింది. పిల్ల‌ల‌కు వ‌చ్చే అన్నిర‌కాల కేన్స‌ర్ల‌లో ఇవి కేవ‌లం 6% మాత్ర‌మే ఉంటాయి. ఈ ప‌రిస్థితి చాలా ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో కీమోథెర‌పీ కూడా చేయించుకోవాల‌ని సూచించారు. మొత్తం చికిత్సకు సాధార‌ణంగా అయితే పెద్ద‌మొత్తంలో ఖ‌ర్చ‌వుతుంది. కానీ, రెహాన్ త‌ల్లిదండ్రుల ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఇదంతా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలో పూర్తి ఉచితంగా చేశారు. శ‌స్త్రచికిత్స‌, వైద్య ప‌రీక్ష‌ల‌లో క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రికి చెందిన వివిధ విభాగాల నిపుణులు కూడా పాలుపంచుకున్నారు. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ ఊపిరితిత్తులే కాకుండా శ‌రీరంలో వేరే ఏదైనా అవ‌య‌వానికి కూడా కేన్స‌ర్ మ‌రోసారి సోకే ప్ర‌మాదం ఉంద‌ని, అందువ‌ల్ల త‌ల్లిదండ్రులు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండి, ఎలాంటి అనారోగ్యం వ‌చ్చినా నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుల‌కు చూపించుకోవాల‌ని డాక్ట‌ర్ ఎం.శ్రీ‌కాంత్‌బాబు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here