Madhulika on Ventilator
ప్రేమోన్మాది భరత్ చేతిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద వుంది. చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది. మరో 24 గంటలు గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై అంచనాకు రాలేమని వైద్యులు చెప్పారు. ఏ మాత్రం శ్వాస తీసుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. మధులిక ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బీపీ, పల్స్ రేట్‌లో కొద్దిగా మెరుగుదల కనిపించిందన్నారు. అయినా ఆమె ఆరోగ్యంపై అవగాహన రావడానికి 24 గంటల సమయం పట్టొచ్చన్నారు. తల, చేతులు, మెడ భాగాల్లో బాగా లోతైన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. తల వెనుక భాగంలో ఎముక విరిగి లోపలికి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైందన్నారు. మధులిక సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఆపరేషన్ మొదలు పెడతామని డాక్టర్లు చెప్పారు.
2019 ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం బర్కత్‌పురలో కాలేజీకి వెళుతున్న సమయంలో మధులికపై భరత్ అటాక్ చేశాడు. కొబ్బరిబోండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. మధులిక శరీరంపై 14 బలమైన కత్తి పోట్లు ఉన్నాయి. భరత్ విచక్షణారహితంగా పొడిచిన కత్తిపోట్లకు బాధితురాలి తలపై భాగంలో పుర్రె రెండుగా చీలిందని, మెదడులోకి కీలక నరాలు తెగిపోయాయని వైద్యులు తెలిపారు. మెడ, దవడ, రెండు చేతుల మణికట్లపై రెండు సెంటీమీటర్ల మేర గాయాలు ఉన్నాయని, ఎడమ చేతివేలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. రక్తస్రావం ఆగి, బీపీ, పల్స్‌రేట్.. సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు సర్జరీ చేస్తామన్నారు.