మహీంద్రా వంద కోట్ల పెట్టుబడి

Mahindra Invest Rs. 100 Crores

• రెట్టింపు కానున్న జహీరాబాద్ ప్లాంట్ కార్మికుల సంఖ్య
• తన నూతన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీని ప్రకటించిన మహీంద్ర గ్రూప్
• జహీరాబాద్ లో ఉన్న తమ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని తెలిపిన మహీంద్రా గ్రూప్
మహీంద్రా నూతన పెట్టుబడిని స్వాగతించిన మంత్రి కేటీఆర్
• తెలంగాణకి నూతన కంపెనీల పెట్టుబడులతో పాటు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు కూడా విస్తరించడం పట్ల హర్షం

తెలంగాణకి మరో పెట్టుబడి రానున్నది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో తన అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద ఈ కె2 సిరీస్ ట్రాక్టర్లను తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కోసం మహీంద్రా సంస్ధ జపాన్కు చెందిన మిట్సుబిషి సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహించి, తక్కువ బరువుగల ట్రాక్టర్ల తయారీకి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. ఈ కే టు సిరీస్ ట్రాక్టర్లను దేశీయ మార్కెట్ లతోపాటు అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రయించనున్నట్లు తెలిపింది. తాను రూపొందిస్తున్న ఈ కె2 సిరీస్ ద్వారా సుమారు ముప్పై ఏడు రకాల మోడళ్లను తయారు చేసే అవకాశం ఉన్నదని కంపెనీ తెలిపింది.

మహీంద్రా గ్రూప్ ప్రకటించిన అదనపు పెట్టుబడిని పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరామారావు స్వాగతించారు. ఈ నూతన పెట్టుబడికి సంబంధించి మహీంద్ర గ్రూప్ కి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మిట్సుబిషి మరియు మహీంద్రా భాగస్వామ్యంతో జహీరాబాద్లో తయారు కానున్న ఈ ట్రాక్టర్లు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికి సంబంధించి కూడా తయారీ రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకి పదుల సంఖ్యలో భారీ నూతన పెట్టుబడులు రావడంతో పాటు తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు సైతం ఇక్కడి వ్యాపార అనుకూలత, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తమ పెట్టుబడులను విస్తరించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు అదనపు పెట్టుబడులు పెట్టడం అంటే తెలంగాణ పట్ల వారి విశ్వాసాన్ని ప్రకటించడమే అని, ఈరోజు మహీంద్రా కంపెనీ చేసిన ఈ ప్రకటన అందులో భాగమే అన్నారు.

ఇప్పటికే అత్యధిక ట్రాక్టర్లు అమ్ముతున్న కంపెనీగా మహీంద్ర గ్రూప్ నిలబడిందని ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఈ కె2 సిరీస్ ద్వారా మరిన్ని వినూత్నమైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ తెలిపారు. ఈ కె2 సిరీస్ ద్వారా స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్ లకు అవసరమైన ట్రాక్టర్లను తయారు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఉన్న తమ జహీరాబాద్ ప్లాంట్ లో స్ధానికులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందని, ఇప్పటికే ప్లాంట్ కార్యకలాపాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి విశేష మద్దతు లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

2012 లో ఏర్పాటుచేసిన జహీరాబాద్ మహీంద్ర ప్లాంట్ ఇప్పటికే అత్యధిక ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్ గా నిలిచింది. ఇప్పటికే ఇక్కడ 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నూతన పెట్టుబడి తో మరో 1500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది లక్ష ట్రాక్టర్లను జహీరాబాద్ నుంచి మహీంద్ర ఉత్పత్తి చేస్తుంది.

Mahindra Latest News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article