కోల్‌కతాలో మమత యాంటీ బీజేపీ ర్యాలీ

Mamatha ANTI BJP Rally on Kolkatta .. కేసీఆర్ గైర్హాజరు

కేంద్రంలో బీజేపీ ని గద్దె దించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలో యునైటెడ్ ఇండియా ర్యాలీకి కోల్ కత్తా ముస్తాబైంది. బిజెపి ఇతర ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకతాటి మీదకు తీసుకువచ్చి ఈ ర్యాలీ ద్వారా మమత బెనర్జీ బీజేపీకి వెన్నులో వణుకు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్న ఈ ర్యాలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేనని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీలో పాల్గొనడమే దానికి కారణం అంటూ ఆయన మమతకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటినుంచి బిజెపి, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్న కెసిఆర్ బీజేపీయేతర కూటమి నేతలు పాల్గొంటున్న ఈ ర్యాలీ లో భాగస్వామ్యం తీసుకోదల్చుకోవటం లేదు.
బీజేపీ వ్యతిరేక పార్టీల ‘మహా బల ప్రదర్శన’కు కోల్‌కతా నగరం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేందుకు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ పేరిట చేపడుతున్న భారీ ర్యాలీకి సుమారు 20 ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే 4లక్షల మంది కార్యకర్తలు కోల్‌కతా చేరుకున్నట్లు సమాచారం.
మహాకూటమి ఆవిర్భావంలో కీలకమైన ఈ ప్రదర్శనకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ హాజరుకాలేకపోతున్నారు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, అభిషేక్ సంఘ్వి హాజరుకానున్నారు. ఈ ర్యాలీకి రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ రాహుల్‌గాంధీ మమతకు లేఖ రాశారు. ఈ ర్యాలీ ద్వారా ‘ఐక్య భారత’ సందేశం బలంగా వినిపిస్తుందని ఆకాంక్షించారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంన్నందున తాము హాజరుకామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్నందున తాము కూడా హాజరుకాలేకపోతున్నామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మమతకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులతో పాటు బీజేపీ అసమ్మతి నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, అరుణ్ శౌరీ కూడా హాజరుకానున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article