ప్రేమకథాచిత్రాలను ఎంత నవ్యతతో తెరకెక్కించారనేది ప్రేక్షకులు ప్రథమంగా చూస్తారు. ప్రతి వారం ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. అందుకు కారణం అందులోని కొత్తదనమే, ఈ వారం `మంచుకురిసే వేళలో` అనే ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల బోడెపూడి దర్శక నిర్మాణంలో వచ్చిన ఈ ప్రేమ కథ టైటిలే పొయెటిక్‌గా ఉంది. ఇదొక హిట్ సాంగ్ పల్లవిలోని ఓ లైన్. అసలు ఈ మంచు కురిసే వేళలో ఏమైంది? దర్శక నిర్మాత బాల బోడెపూడి ఈ చిత్రం ద్వారా ప్రేమలో ఏ కోణాన్ని టచ్ చేయాలనుకున్నాడో తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం..
బ్యానర్: ప‌్రణతి ప్రొడక్షన్స్
నటీనటులు: రామ్‌కార్తీక్, ప్రనాలి, యశ్వంత్, చమ్మక్ చంద్ర, విజయ్ సాయి, కత్తి మహేశ్, టి.ఎన్.ఆర్ తదితరులు
ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: శ‌్రవణ్ భరద్వాజ్
కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: బాల బోడెపూడి
కథ:
అనంద్ కృష్ణ (రాంకార్తీక్) వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. మరో పక్క రేడియో సిటీ జాకీగా పనిచేస్తుంటాడు. కాలర్స్‌తో ప్రేమ గురించి, ప్రేమికుల గురించి ఓ కాన్సెప్ట్ మాట్లాడే సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి తన ప్రేమ విఫలమైందని.. కాబట్టి విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతాడు. మరో ఆలోచన లేకుండా ఆనంద్ ఓ అబద్ధపు ప్రేమకథను తన ప్రేమకథ చెప్పడం ప్రారంభిస్తాడు. అమ్మాయి తనకు కనపడే వరకు చెప్పగానే షో టైం అయిపోతుంది. శ్రీనివాస్‌ను మరో షోలో కాల్ చేయమని చెప్పి స్నేహితుడితో కలిసి బీచ్‌కి వెళతాడు. అక్కడ నిజంగా తన మనసుకి నచ్చేలా ఓ అమ్మాయి కనపడుతుంది. ఆ అమ్మాయితో మాట్లాడాలనుకునేలోపు ఆమె వెళ్లిపోతుంది. అయితే ఆనంద్ కాలేజీలోనే చేరుతుంది. ఆమెతో పరిచయం పెంచుకుంటాడు ఆనంద్. ఆమె పేరు గీతాంజలి అని తెలుస్తుంది. ఓ రోజు ఆమెకు తన ప్రేమ గురించి చెబుతాడు. ఆమె తన ప్రేమ కథను చెప్పడం ప్రారంభిస్తుంది. అసలు గీత ప్రేమ కథ ఏంటి? చివరకు ఆనంద్, గీత కలుసుకున్నారా? ప్రేమ విఫలమైతే చావే శరణ్యమా? అనే విషయాలు తెలియాంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
నటీనటుల పరంగా చూస్తే..రాంకార్తీక్ చక్కగా నటించాడు. ప్రనాలి లుక్ వైజ్ చూస్తే పూనమ్ బాజ్వాలా కనపడింది. తొలి సినిమానే అయినా నటన పరంగా బాగానే చేసింది. ఇక వెంకట్ సాయి, చమ్మక్ చంద్ర, యశ్వంత్ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ప్రధాన కథాంశమంతా కొత్త నటీనటుల చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు బాల బోడెపూడి వారి నుండి మంచి నటనను రాబట్టుకున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ ప్రనాలి ఫస్టాఫ్‌లో సీరియస్‌గా కనపడుతుంది. కానీ సెకండాఫ్‌లో బబ్లీగా కనపడుతుంది. సినిమా థ్రెడ్ పాయింట్ ఆమె చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు బాలబోడెపూడి ప్రేమ జీవితంలో చాలా ముఖ్యమే.. అయితే విఫలమైనంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోకూడదనే విషయాన్ని చెప్పాడు. అది కూడా పొయెటిక్ పంథాలో చెప్పుకొచ్చారు బాల. విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. అది కూడా వైజాగ్, కునూర్, ఊటీ ప్రాంతాలను చాలా అందంగా విజువలైజ్ చేశారు. సినిమాటోగ్రాఫర్స్ తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి పడ్డ కష్టం తెరపై అందంగా కనపడింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, నేపథ్య సంగీతం బావున్నాయి. సీన్స్ లెంగ్తీ కాకుండా ఎడిటింగ్ చూసుంటే బావుండేది.
బోటమ్ లైన్: మంచు కురిసే వేళలో.. మంచి ప్రయత్నం
రేటింగ్ : 2.75/5