MEDA MALLIKARJUNREDDY LEAVES TDP
మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ మార్పులు ఊపందుకున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత, కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి.. టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. గత ఆరునెలలుగా మేడా మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు జగన్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని కడప జిల్లా తెదేపా నేతలు చెబుతున్నారు. ఆయన పార్టీ వీడతారని తమకు ముందే తెలుసుని, మేడా వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం జరగదని పేర్కొంటున్నారు.
జగన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చినందునే మేడా.. టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, టీడీపీ నుంచి మేడా మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మేడాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు అక్కడికక్కడే ప్రకటించారు.