Saturday, November 30, 2024

మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నాం

మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి
ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాం
ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని, మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. వచ్చేనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లో జరుగనున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. మాలల సింహగర్జన సభ నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యే వివేక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని, ఇకనైనా మాలలు ముసుగు వేసుకొని ఇంట్లో కూర్చోకుండా బయటికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నీ కులాల వారు ఈ సమావేశాలు నిర్వహించుకుంటారని అలాంటప్పుడు మాలలు సమావేశం జరుపుకుంటే తప్పు ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాము వేరే కులాల గురించి మాట్లాడడం లేదని తమ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాం
తక్కువ సంఖ్యలో ఉన్న మాలలను దోచుకుంటున్నారని ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్టులు వారికే వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మాలలకే కాదు మాదిగలు, ఎస్టీలకు కూడా వ్యరేతికంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కుల వివక్ష లేదన్న భావన కలిగించేలా ఉందని ఆయన పేర్కొన్నారు. కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటు ఒక్కటి కాదని రాజ్యాంగంలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ గుర్తు చేశారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని రాజ్యాంగాన్ని కాపాడాలన్నదే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా కుల వివక్ష లేదని ఏ ఒక్కరైనా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల్లో కుట్రలు ఉన్నాయని, అలాంటి కుట్రలు మాలల్లో ఉండొద్దన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. మాలల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించామని కానీ, రాహుల్ గాంధీకి, ప్రభుత్వానికి ఎక్కడా తాము వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా లేదని దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేయొద్దని ఆయన కోరారు. తమ మాల జాతి ఐక్యత కోసమే డిసెంబర్ 1వ తేదీన మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular