MLA HAS NO HOUSE
- మధ్యప్రదేశ్ లో అరుదైన ఘటన
ఆయనో ఎమ్మెల్యే. కానీ ఉండేది పూరి గుడిసెలో. దీంతో స్థానికులే చందాలు వేసుకుని మరీ ఆయనకు ఇల్లు కట్టిస్తున్నారు. అరుదైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. భారీగా డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవడం.. తర్వాత అందినకాడికి దండుకోవడం.. ఇదీ ప్రస్తుత రాజకీయాల తీరు. కానీ మధ్యప్రదేశ్ లోని పియోష్ పూర్ జిల్లా విజయ్ పూర్ ఎమ్మెల్యే సీతారాం మాత్రం ఇందుకు భిన్నం. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించారు. అంతకుముందు రెండు సార్లు పోటీచేసి ఓటమి చవిచూసిన ఆయన.. తాజా ప్రయత్నంలో మాత్రం గెలుపు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, సీతారాం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఆదివాసి తెగకు చెందిన ఆయన.. ఇంటి అద్దె కూడా కట్టే పరిస్థితి లేకపోవడంతో ఓ పూరి గుడిసెలో ఉంటున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే తొలి జీతం కూడా అందుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు సీతారం పరిస్థితి చూసి విస్తుపోయారు. వెంటనే చందాలు వేసుకుని ఆయనకు ఇల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉంటున్న పూరి గుడిసె కూడా గత ఎన్నికల్లో గెలిచిన అనంతరం కట్టుకున్నదే. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అక్కడి ప్రజలకు ఆయనకు చిల్లర నాణెలతో తులాభారం వేశారు. ఆ డబ్బుతోనే సీతారాం ఆ గుడిసె కట్టుకున్నారు. తనకు ప్రజలు ఇల్లు కట్టించడంపై ఆయన చాలా సంతోషం వ్యక్తంచేశారు. తనది చాలా పేద కుటుంబమని వెల్లడించారు. ‘నా నియోజకవర్గ ప్రజలు నాకు విరాళాలిచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నా తొలి జీతాన్ని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చుచేస్తాను’ అని తెలిపారు.