మండలి రద్దు తీర్మానానికి రాపాక మద్దతు..

135
MLA Rapaka Supports Abolish Of Legislative Council
MLA Rapaka Supports Abolish Of Legislative Council

MLA Rapaka Supports Abolish Of Legislative Council

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు  చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని  తెలిపారు. జనసేన నిర్ణయాలను తుంగలో తొక్కి వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్న రాపాకపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే . అయినప్పటికీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ జగన్ తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నారు.
ఇక మండలి రద్దు గురించి జరిగిన చర్చలో రాపాక  వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమని పేర్కొన్నారు.  రాష్ట్ర అభివృద్ధికి పని చేసే ప్రతిసారి  టీడీపీ విఘాతం కలిగించటం దురదృష్టకరమన్నారు.అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా మాట్లాడిన  రాపాక వరప్రసాద్‌ అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్‌ అధికారులు ఉండగా ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలతో తాను  ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.

అసెంబ్లీలో ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక మళ్లీ మండలి అవసరం లేదని రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రాపాక మండిపడ్డారు.154 మంది శాసన సభ్యులు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

ఇంగ్లీష్‌ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుందన్నారు . ఏకంగా మండలి చైర్మన్‌ షరీఫ్‌ను కూడా ఆయన ప్రభావితం చేశారని రాపాక మండిపడ్డారు . బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్‌ ఎంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్న రాపాక చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో సీఎం జగన్ పాలనను రాపాక వరప్రసాద్ కొనియాడారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here