మా పథకాలపై తన స్టిక్కర్ వేసుకుంటున్నారు

MODI FIRED IN CBN

  • అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ది
  • అవినీతి, అక్రమాల్లో నాకంటే ఆయనే సీనియర్
  • చంద్రబాబుపై ప్రధాని మోదీ ధ్వజం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణమని చెబుతూ వ్యక్తిగత అభివృద్ధితో బిజీ అయిపోయారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో కూలిపోతున్న తన పార్టీని నిర్మించుకుంటున్నారని.. రాజధాని నుంచి పోలవరం వరకు అంతటా అవినీతే ఉందని ఆరోపించారు. అవినీతి, అక్రమాల్లో చంద్రబాబు నిజంగానే తనకంటే సీనియర్ అని వ్యాఖ్యానించారు. కేంద్ర నుంచి వచ్చిన నిధులకు లెక్కలు అడుగుతుంటే భయపడి పారిపోతున్నారని.. ఓటమి భయంతో అనుక్షణం వణికిపోతున్నారని దుయ్యబట్టారు. ఈ తండ్రీ కొడుకుల అవినీతి సర్కారును గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఆదివారం గుంటూరులో బీజేపీ నిర్వహించిన ‘ప్రజా చైతన్య సభ– సత్యమేవ జయతే’ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం చంద్రబాబు, లోకేశ్ అవినీతి లక్ష్యంగానే సాగింది. చంద్రబాబును సీఎం చంద్రబాబు అని పేరు పెట్టి ప్రస్తావించకుండా లోకేశ్ పిత అని సంభోధించడం విశేషం.

చంద్రబాబు ఇన్నాళ్లూ రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి, ఇప్పుడు అసత్య ప్రచారం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మోదీ మండిపడ్డారు. తనకంటే సీనియర్ అని బాబు పదేపదే చెప్పుకుంటున్నారని.. అది నిజమేనంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. ‘అవును.. మీరు నా కన్నా సీనియర్‌.. అందుకే మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాం. కానీ మీరు మాత్రం కూటములు మారడంలో సీనియర్‌. కొత్త పొత్తులు పెట్టుకోవడంలో సీనియర్‌.  సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియర్‌. ఒక ఎన్నికల తరువాత మరో ఎన్నికల్లో ఓడిపోవడంలో సీనియర్‌. ఈరోజు ఎవరిని తిడతారో రేపు మళ్లీ వారి ఒళ్లోనే కూర్చోవడంలో సీనియర్‌. ఆంధ్రా ప్రజల కలల్ని వంచించడంలో సీనియర్‌. ఇలాంటి సీనియార్టీ నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న చంద్రబాబు ఆయన ఆశయాలను నిలబెట్టలేకపోయారన్నారు. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ దుష్ట కాంగ్రెస్‌ అంటే.. చంద్రబాబు నేడు దోస్త్‌ కాంగ్రెస్‌ అంటున్నారని విమర్శించారు. తమ రాజకీయ అవసరాల కోసం ఇప్పటివరకు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారంతా కలసి మహాకల్తీ కూటమిని ఏర్పాటు చేశారని, ఇప్పుడు అందులో చంద్రబాబు కూడా చేరారని విమర్శించారు.

చంద్రబాబులా తనకు వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం రాదన్నారు. ‘నాకు సంపద పెంచడం రాదని చంద్రబాబు అంటున్నారు. అవును, నాకు చంద్రబాబులా వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం చేతకాదు. అమరావతి నుంచి పోలవరం దాకా చంద్రబాబు కేవలం తన ఆస్తులు పెంచుకొనే ప్రయత్నం చేశారు’ అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించడంలో తాము ఎలాంటి లోపం చేయలేదని ప్రధాని స్పష్టంచేశారు. హోదాకు సమానమైన లబ్ధి చేకూర్చే విధంగా మంచి ప్యాకేజీ రూపొందించామని.. దీనికి బాబు కూడా సంతోషించి తమకు ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటివరకు ప్యాకేజీ కింద కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీకి ఇచ్చినట్టు చెప్పారు. ప్రజాధనాన్ని తన ప్రచారానికి, పార్టీ ప్రచారాల కోసం చంద్రబాబు దుబారా చేస్తున్నారని విమర్శించారు. ఈ తండ్రీ కొడుకుల అవినీతి ప్రభత్వం త్వరలోనే ప్రజల చేతిలో మట్టి కరవనుందని వ్యాఖ్యానించారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article