చేసిందంతా చేసి.. నన్నంటారా?

MODI FIRED ON CONGRESS

  • కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ధ్వజం
  • మమత కూటమి మహా కల్తీదని వ్యాఖ్య

దేశంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసింది కాంగ్రెస్సేనని, కానీ అన్ని వ్యవస్థల్ని మోదీయే నాశనం చేస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. ‘దేశంలో ఎమర్జెన్సీ విధించింది మీరే.. న్యాయవ్యవస్థను, సీబీఐని, ఈడీని అవమానించింది మీరే.. ఆర్మీ చీఫ్ ను రౌడీగా అభివర్ణించింది మీరే.. సైన్యం బలోపేతం కాకూడదని కోరుకునేదీ మీరే. కానీ అన్ని వ్యవస్థల్ని మోదీయే నాశనం చేస్తున్నారని రాద్ధాంతం చేస్తున్నారు’ అని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బీజీపీపైనా, తనపైనా విమర్శలు చేసే క్రమంలో కొందరు దేశాన్నే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. దాదాపు గంటా నలభై నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కాంగ్రెస్‌ను, ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ‘ఒక వేలిని నావైపు చూపిస్తే నాలుగు వేళ్లు మీ వైపే చూపిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న ‘మహాకూటమి’ని మహా కల్తీ కూటమిగా అభివర్ణించారు. అలాంటి ప్రభుత్వాన్ని ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం తిరస్కరిస్తుందని చెప్పారు. అందులోని నాయకులంతా బెయిల్ పై ఉన్నవారేనని ఎద్దేవా చేశారు.

అహంకారంతో మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించగా.. వాటినీ తిప్పి కొట్టారు. ‘‘1984లో రెండు సీట్లకు పరిమితమైన మా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. అహంకారం వల్లనే మీరు 440 సీట్ల నుంచి 44కు పడిపోయారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘దేశాన్ని దోచుకున్నవారు నరేంద్ర మోదీ అంటే భయపడాల్సిందే.  నేను ఎవరికి ఏమీ ఇవ్వను. ఎవరి నుంచి ఏమీ తీసుకోను. 2010 నాటి కామన్వెల్త్‌ క్రీడలనే తీసుకోండి. భారత్‌కు పతకాలు సాధించిపెట్టాలని క్రీడాకారులు కఠోరంగా చెమటోడ్చితే కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు మాత్రం తమ వ్యక్తిగత సంపద వృద్ధికి దాన్నొక అవకాశంగా మార్చుకున్నారు. యూపీయే పాలకులు బ్యాంకులకు ఫోన్‌చేస్తే చాలు.. వారి మిత్రులకు డబ్బులు చేరిపోయేవి. ఇలాంటి విధానాలతో బ్యాంకింగ్‌ వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయింది’’ అని మోదీ విమర్శించారు. కాలానికి కొలమానాలుగా పేర్కొన్న ‘బీసీ’ (క్రీస్తు పూర్వం), ‘ఏడీ’ (క్రీస్తుశకం)లకు కాంగ్రెస్ లో అర్థాలు వేరని.. ‘బీసీ’ అంటే ‘బిఫోర్‌ కాంగ్రెస్‌’ (కాంగ్రెస్‌ కంటే ముందు) అనీ, ‘ఏడీ’ అంటే ‘ఆఫ్టర్‌ డైనాస్టీ’ (వారసత్వం తర్వాత) అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. మొత్తమ్మీద గత కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలన్నింటికీ ఒక్కసారే సమాధానం చెప్పడంతోపాటు విపక్షాలు మోదీ ఏకిపారేశారు.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article