శబరిమల వివాదంపై తొలిసారి స్పందించిన మోడీ

Modi First time responded on sabarimala

కేరళ రాష్ట్రంలో పలు ఘర్షణలకు కారణం అవుతున్న శబరిమల అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కేరళ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పపట్టారు. కాంగ్రెస్ కూడా శబరిమల ఇష్యూలో రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని దుయ్యబట్టారు.శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో కేరళ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత హేయమైన చర్యగా చరిత్రలో నిలిచిపోతుందని మోదీ మండిపడ్డారు.
తాజాగా కేరళలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొల్లాంలో నేషనల్ హైవే-66పై నిర్మించిన 13 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును – బలంగీర్ లో 1550 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేరళ ప్రజలకు అండగా ఉండేది బీజేపీయేనని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీయే మలయాళీల సంప్రదాయాలకు రక్షణ కవచంలా నిలుస్తుందని వ్యాఖ్యనించారు. తమ పార్టీ కార్యకర్తలను తక్కువగా చూడొద్దని యూడీఎఫ్ – ఎల్డీఎఫ్ పార్టీలను మోదీ హెచ్చరించారు. కుంభకోణాలు బయటపెడుతున్నందుకే తనను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు.
శబరిమల వివాదాన్ని ఉద్దేశించి కమ్యూనిస్టులు ఆధ్యాత్మికపరమైన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించరనే విషయం అందరికి తెలుసునని ఆయన పేర్కొన్నారు. అయితే శబరిమల విషయంలో ఇంత హీనంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పై కూడా మోదీ ధ్వజమెత్తారు. కులం – మతం – అవినీతి వంటి విషయాల్లో కేరళలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్ డీఎఫ్) ప్రభుత్వానికి కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూడీఎఫ్ ప్రభుత్వానికి తేడా లేదని అన్నారు. అవి ఒకే నాణేనికి రెండు వైపులని ఎద్దేవా చేశారు. శబరిమల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడం సరికాదని మోదీ అన్నారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కాంగ్రెస్ పార్లమెంట్ లోపల ఒకలా.. వెలుపల మరోలా మాట్లాడుతోందని విమర్శించారు. తమ అసలైన వైఖరేంటో స్పష్టం చేయాలని కాంగ్రెస్ కు సూచించారు.

For More  FB/Tsnews, G+/TSNEWS, YT/TSNEWS , TW/TSNEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article