కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య
‘అమ్మా.. నన్ను బావిలో పడెయ్యొద్దు’ అన్న ఆ బిడ్డ మాటలు ఆమె దీనంగా వింది. భయపడుతున్న తన కూతురిని ఇంటికి పంపించేసి.. తన కొడుకుతో సహా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో అరుంధ అనే వివాహిత తన కొడుకు రిత్విక్‌ను బావిలో తోసేసి తాను ఆత్మహత్య చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురును, కుమారుడిని పొలం వద్దకు తీసుకెళ్లిన మహిళ ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించింది. కూతురు ప్రజ్వల ‘అమ్మా.. నన్ను బావిలో తొయ్యకు’ అంటూ వేడుకోవడంతో ఆమెను ఇంటికి పంపించేసింది.
అనంతరం కొడుకును బావిలో వేసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శేఖర్ అనే వ్యక్తి తన తల్లి కాల్ చేసి ఏడిపించాడని.. చనిపోయే ముందు అతనికి ఫోన్ చేసి చనిపోతున్నా.. గుడ్ బై అంటూ ఏడుస్తూ చెప్పిందని కూతురు ప్రజ్వల కన్నీటితో పోలీసులకు వివరించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.