మూడు రాజధానుల నిర్ణయం ఆర్ధిక భారమే అన్న ఎంపీ గల్లా

95

MP GallaJayadev About 3 Capitals

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమంటూ,  అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ దుమారం రేపింది.  దానికి తగ్గట్టు జిఎన్ రావు కమిటీ నివేదిక కూడా  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టుగా ఉండటం  ఏపీ రాజధాని  అమరావతిని డోలాయమాన పరిస్థితిలో పడేసింది. ఇక దీనిపై రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై గుంటూరు  ఎంపీ గల్లా జయదేవ్ చాలా తీవ్రంగా స్పందించారు.  అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని సీఎం జగన్  చేసిన ప్రకటన  మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇప్పటికే విభజనతో చాలా నష్టపోయామని చెప్పిన గల్లా జయదేవ్ రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్ ను  సైతం కోల్పోయామని పేర్కొన్నారు.  ఇప్పుడు సీఎం జగన్  చేసిన ప్రకటనతో మరోమారు ఏపీ నష్టపోతుందని తెలిపారు.  అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ అధికార వికేంద్రీకరణ కాదని గల్లా జయదేవ్ హితవుపలికారు.  30 వేల మంది రైతులు  33 వేల ఎకరాల భూములు ఇస్తే,  ఆ భూములు సేకరించటానికి నాటి ప్రభుత్వం చాలా తంటాలు పడింది.  భూములు ఇవ్వడానికి మొదట అంగీకరించని  రైతులు  రాష్ట్ర అభివృద్ధి కోసం  చివరకు తమ పంటపొలాలను త్యాగం చేశారని గల్లా పేర్కొన్నారు . ఇప్పుడు అధికార పార్టీ మారిందని నిర్ణయాలు మార్చుకుంటే  రైతుల పరిస్థితి ఏంటి అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. ఇక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక  సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రెండు ఒకేలా ఉన్నాయ్ అని,  సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయం మేరకు నిపుణుల కమిటీని  ప్రభావితం   చేశారని గల్లా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here