పహల్గామ్ ఉగ్రదాడిలో తన భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ను కోల్పోయిన హిమాన్షి నర్వాల్ సమాజానికి శాంతి సందేశాన్ని అందించారు. భర్త స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని… శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.
వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ నిన్న ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హిమాన్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. “మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి” అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. ఇంతటి విషాదం నెలకొన్నప్పటికీ, హిమాన్షి ద్వేషానికి బదులు శాంతి, న్యాయం కోసం పిలుపునివ్వడం గమనార్హం.