జయరాం హత్య మిస్టరీ

Mystery behind  Jaya Ram murder …. శిఖా చౌదరి అరెస్ట్

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విష ప్రయోగం జరిగిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం రక్త నమూనాలను విజయవాడ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు చిగురుపాటి జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పారిశ్రామిక వేత్త జయరామ్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న జయరామ్ ఇంటికి నందిగామ పోలీసులు చేరుకున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజీని దర్యాప్తు బృందం పరిశీలించింది.
ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో పలు చిక్కుముళ్లు ఉన్నట్లు అర్థమవుతోంది. నందిగామ పోలీసులు హైదరాబాదులోని జయరాం మేనకోడలు శిఖా చౌదరి ఇంటికి చేరుకున్నారు. అయితే, శిఖా చౌదరి ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు శిఖా చౌదరి డ్రైవర్ భార్యను విచారించారు.మేడమ్ నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడున్నారో తెలియడం లేదని శిఖా చౌదరి డ్రైవర్ భార్య చెప్పింది. శిఖా చౌదరి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కారులో బయటకు వెళ్లినట్లు, ఆ తర్వాత తిరిగి ఇంటికి రానట్లు తెలుస్తోంది. జయరాం శిఖా చౌదరి ఇంటికి వస్తుండేవారని ఆమె డ్రైవర్ భార్య మాటలను బట్టి తెలుస్తోంది.
జనవరి 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జయరాం శిఖా చౌదరి ఇంటికి వచ్చాడని, రాత్రి 8 గంటల వరకు ఉన్నాడని చెబుతున్నారు. జయరాం హత్యకు హైదరాబాదులోనే పథకం వేశారని భావిస్తున్న నందిగామ పోలీసులు పది బృందాలుగా విడివడి దర్యాప్తు సాగిస్తున్నారు. శిఖా చౌదరిని పోలీసులు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.శిఖా చౌదరి ఇంటికి వచ్చినప్పుడు జయరామ్ తాగి ఉన్నాడని ఆమె డ్రైవర్ భార్య చెబుతోంది. అయితే, ఆయనకు బయట మద్యం సేవించే అలవాటు లేదని ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. జయరాం కారులో ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారును మరో కారు వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కారు వెనక ఉన్న కారు కీసర టోల్ ప్లాజా వద్ద సీసీటీవి ఫుటేజీలో కనిపించింది.
జయరాం కారు రాత్రి పది గంటలకు చిల్లకల్లు క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన మర్నాడు ఉదయం ఐదు గంటలకు కారులో శవమై కనిపించారు. ఆయన కారు నిలిపి ఉన్న చోటికి చిల్లకల్లు నుంచి 45 నిమిషాల సమయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆయనను కారులో ఉన్నవారే చంపారా, వెనక వచ్చిన కారులో ఉన్నవారు చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయరాంను హత్య చేసిన తర్వాత తిరిగి వారు హైదరాబాదు తిరిగి వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయరాం కారులో బీరు సీసాలు, సిగరెట్ పీకలు కనిపించాయి. ఆయనకు మద్యంలో విషం కలిపి తాగించి ఉంటారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఆయనను హత్య చేసిన తర్వాత కారును వదిలేసి ఉంటారా అనేది కూడా తెలియడం లేదు.కోస్టల్ బ్యాంక్ షేర్ల బదలాయింపుపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, జయరాం మిత్రుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article