Nagoba Festival
ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సోమవారం (ఫిబ్రవరి 4,2019) అర్ధరాత్రి నుంచి ప్రారంభంకానుంది. నాలుగురోజుల కిందట మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని కాలినడకన కెస్లాపూర్‌కు చేరుకున్నారు. నాగోబా ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్ల కింద సేదతీరారు. అర్ధరాత్రి సమయంలో మెస్రం వంశీయల ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుంది. ఈ నెల 7న దర్బార్ జరుగనుండగా.. జాతరకు వచ్చేవారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి నాగోబాను ఆదివాసీలు తమ ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఈ జాతరకు తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. జాతరలో ప్రజా దర్బార్ కీలకమైనది. మంత్రులు, కలెక్టర్, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత. 1946లో శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ సూచనలో నిజాం కాలం నుంచి ప్రభుత్వం అధికారికంగా జాతరను నిర్వహిస్తున్నది.
ఏ ఇబ్బందుల్లేకుండా తెలంగాణ సర్కారు గత ఏడాది నాగోబా ఆలయ నిర్మాణంతోపాటు ఇతర వసతులకు నిధులు మంజూరు చేసింది. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లు, రూ.1.5 కోట్లతో దర్బార్, విశ్రాంతి భవనం నిర్మాణాలు జరుగుతున్నాయి. కెస్లాపూర్ నుంచి నాగోబా ఆలయం వరకు రూ.66 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణం, మల్లాపూర్ నుంచి నాగోబా ఆలయం వరకు రూ.84 లక్షలతో బీటీ రోడ్డు పూర్తయింది. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, భోజన వసతి, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయనున్నారు