ఉన్నది కూల్చి సచివాలయ ఈశాన్యంలోకి నల్ల పోచమ్మ ఆలయం ?

NALLA POCHAM TEMPLE IN SECRETARIAT

సచివాలయం కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కార్‌‌ను ఆరోపణలు వెంటాడుతున్నాయి. పాత భవనం పటిష్టంగా ఉన్నప్పటికీ కొత్త నిర్మాణం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తు, గీస్తు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని విపక్ష నేతలు ఫైరవుతున్నారు.వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్.. కొందరు పండితుల సూచనల మేరకు అసెంబ్లీ, సచివాలయం భవనాలు కొత్తవి నిర్మించేలా ప్లాన్ చేశారనే వాదనలున్నాయి. పార్టీ పటిష్టతకు, ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఉండేందుకే ఇదివరకు వివిధ రకాల యాగాలు కూడా చేశారనే పేరుంది. అలాంటి క్రమంలో తాజాగా సెక్రటేరియట్‌లోని నల్ల పోచమ్మ ఆలయాన్ని కూడా ఈశాన్యం వైపు తరలించేందుకు నిర్ణయించారనే టాక్ నడుస్తోంది.

వాస్తు, గిస్తు అంటూ చెక్కుచెదరని భవనాలను కూల్చడమేంటని విపక్ష నేతలు భగ్గుమంటున్నా.. హైకోర్టులో చుక్కెదురైనా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ఆరు నూరైనా అసెంబ్లీ, సచివాలయం కొత్త భవనాలు నిర్మించేందుకు సన్నద్ధమైంది. అయితే వాస్తు పేరిట నల్ల పోచమ్మ ఆలయాన్ని కూడా తరలించేందుకు ప్రయత్నం జరుగుతుందనే ప్రచారంతో కొందరు ఆరోపణాస్త్రాలు గుప్పిస్తున్నారు. పాత భవనాల్లో పరిపాలన సాగిస్తూ గత ప్రభుత్వాలు పనిచేయలేదా.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన కష్టమేంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాస్తు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమేంటని విమర్శిస్తున్నారు.

కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇక విపక్ష నేతలు న్యాయపోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. ఆ రెండు భవనాలు నిర్మించి తీరుతామని స్పష్టం చేస్తోంది. వాస్తు లెక్కలతో సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెర లేపారనే నేపథ్యంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో సచివాలయంలోని నల్ల పోచమ్మ ఆలయాన్ని కూడా అక్కడి నుంచి తరలించనున్నారనే ప్రచారం హాట్ టాపికైంది. ఈశాన్యం వైపు అమ్మవారి ఆలయం పునర్‌నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దాంతో ఆలయ కమిటీ వ్యతిరేకించే పరిణామాలు కనిపిస్తున్నాయి. నల్ల పోచమ్మ ఆలయంపై ప్రభుత్వ నిర్ణయమేంటనేది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ సెక్రటేరియట్‌లోని మొత్తం భవనాలను కూల్చేయాలని భావిస్తే.. గుడి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దాదాపుగా ప్రస్తుతమున్న అన్నీ బ్లాకులను తొలగించి.. ప్రస్తుతం సి బ్లాక్ ఎక్కడైతే ఉందో అదే స్థలంలో కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఆ మేరకు పాత భవనాల కూల్చివేతపై ఇప్పటికే ఈఎన్‌సీ లతో టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే నల్ల పోచమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతమున్న సీ బ్లాక్ స్థలంలో కొత్త సచివాలయం నిర్మిస్తే.. దాని ముందు గార్డెన్, ఫౌంటెన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో నల్ల పోచమ్మ ఆలయాన్ని అక్కడినుంచి కదిపే అవకాశం లేకపోలేదంటున్నారు కొందరు. అయితే అక్కడి నుంచి అమ్మవారి ఆలయాన్ని కదిపి.. ప్రస్తుతం హెలిప్యాడ్ ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అక్కడ అమ్మవారిని పునఃప్రతిష్టించాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. అదలావుంటే నల్ల పోచమ్మ ఆలయం తరలించనున్నారనే ప్రచారంతో ఆలయ కమిటీ సభ్యులు అలర్ట్ అవుతున్నట్లు సమాచారం. అక్కడి బొడ్రాయికి వందేళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. 2012వ సంవత్సరంలో దాదాపు 35 లక్షల రూపాయలతో ఆలయం నిర్మించి అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. గుడిని అక్కడినుంచి తరలించుకుండా ప్రభుత్వానికి విన్నవించేందుకు కమిటీ సభ్యులు రెడీ అవుతున్నారట.

LATEST POLITICAL NEWS

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article