NAMA WILL JOIN IN TRS
- త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్న నాగేశ్వరరావు
- ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి…
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. మూడు రోజుల క్రితం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమైన ఆయన.. తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నామా పార్టీని వీడబొతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచాం సాగుతోంది. ఆయన టీడీపీని వీడి, కాంగ్రెస్ లో చేరతారని, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీచేస్తారని కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి తొలుత చంద్రబాబుకు అన్నీ వివరించారని, ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే, కాంగ్రెస్ లో చేరతారని అందరూ భావించగా.. అనూహ్యంగా ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన కారెక్కడం ఖాయమనే మాటలు వినిపించాయి. త్వరలో కేసీఆర్ సమక్షంలో నామా నాగేశ్వరరావు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగే అవకాశం ఉంది.