నానీస్ గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

220
NANI'S GANG LEADER REVIEW
NANI'S GANG LEADER REVIEW

NANI’S GANG LEADER REVIEW

సినిమా టైటిల్: నానీస్ గ్యాంగ్‌ లీడర్‌
నటీనటులు: నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
నిర్మాత: మోహన్ చెరుకూరి, రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని
దర్శకత్వం: విక్రమ్‌ కె కుమార్‌

నేచురల్ స్టార్ నాని, విభిన్న చిత్రాలతో ప్రేక్షకులన మెప్పించిన విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు తొలిరోజే ఏర్పడిపోయాయి. పైగా ఇద్దరూ కూర్చుని కాఫీ తాగుతూ ఉన్న పోస్టర్ ను టీజర్ గా విడుదల చేసి తామిద్దరం కలిసి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన తీరు కూడా ఆకట్టుకుంది. అనంతరం మెగాస్టార్ కెరీర్ లో భారీ హిట్లలో ఒకటైన గ్యాంగ్ లీడర్ పేరు పెట్టడం.. రొటీన్ గా కాకుండా గ్యాంగ్ అంతా మహిళలు.. అది కూడా వివిధ రకాల వయసున్నవారు కావడంతో ఇది కూడా ఏదో విభిన్నమైన సినిమా అని ప్రేక్షుకులు భావించారు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఆ అంచనాలను ఈ గ్యాంగ్ లీడర్ అందుకున్నాడా? ఓసార చూద్దాం.

కథేంటి?

ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.300 కోట్ల భారీ చోరీ జరుగుతుంది. ఆరుగురు వ్యక్తులు ఈ చోరీ చేయగా.. చివర్లో వారిలో ఒకడు ఆ ఐదుగురినీ చంపి డబ్బంతా తీసుకుని పారిపోతాడు. అనంతరం ఆ ఐదుగురి కుటుంబ సభ్యుల్లో మిగిలిన ఆడవాళ్లంతా కలిసి తమవాళ్లను చంపినవాడిని చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఇందుకోసం రివెంజ్ కథలు రాసే పెన్సిల్ పార్థసారథి (నాని) సహాయం తీసుకోవాలని భావిస్తారు. అతడు కూడా ఆ కథను రాసి డబ్బు చేసుకోవాలనే ఆశతో వారికి సాయం చేయడానికి అంగీకరిస్తాడు. అనంతరం ఆ ఐదుగురితో కలిసి హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? విలన్ ఎవరన్నది ఎలా కనిపెడతాడు? అనే విషయాలు తెరపై చూడాల్సిందే.

నటీనటులు ఎలా చేశారు?

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన అతడు.. తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఎక్కడా నాని అనే ఫీలింగ్ కలగకుండా పెన్సిల్ పార్థసారథి పాత్ర మాత్రమే కనిపించేలా చేయడంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు. ఇక విలన్ గా చేసిన ఆర్ఎక్స్-100 ఫేమ్ కార్తికేయ బాగానే చేశాడు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంక అరుల్‌ మోహన్‌ పర్వాలేదనిపించింది. ఇక లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా ఉంది?

విక్రమ్ కె కుమార్ అంటే ప్రేక్షకులు ఓ క్రేజ్ ఉంది. ఇష్క్, మనం, 24 వంటి విభిన్నమైన చిత్రాలతో హిట్ కొట్టిన అతడు.. నానితో కలిసి సినిమా చేస్తున్నాడంటే అందరిలో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి కాంబినేషన్ నుంచి బ్లాక్ బస్టర్ ఖాయమని భావించారు. అయితే, వాటిని అందుకోవడంలో విక్రమ్ కె కుమార్ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. చక్కని స్క్రీన్ ప్లే కి పెట్టింది పేరైన విక్రమ్ కె కుమార్ ఈ సినిమాలో మాత్రం తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. బ్యాంకు దోపిడీతో ఉత్కంఠ కలిగించేలా ప్రారంభమైన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. పైగా తర్వాత ఏం జరుగుతుందో ముందే ప్రేక్షకుడు అంచనా వేయగలగడం కూడా ఈ సినిమాకు మైనస్ గానే భావించొచ్చు. సినిమా ఓవరాల్ గా బాగానే ఉన్నప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే, సుదీర్ఘ సన్నివేశాలు, కథను ఊహించగలగడం సినిమాకు ప్రతికూలంగా మారాయి. అయితే, కామెడీతోపాటు నాని డైలాగులు బావున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా కుదిరాయి. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ పై కాస్త దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్లి ఉండేది. సరదాగా కాసేపు ఓ మంచి సినిమా చూద్దామనుకునేవారికి మాత్రం నానీస్ గ్యాంగ్ లీడర్ పర్వాలేదనిపిస్తాడు.

బాటమ్ లైన్: పవర్ ఫుల్ కాదు కానీ.. పర్వాలేదనిపించే గ్యాంగ్ లీడర్

MOVIE REVIEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here