Nara Lokesh Fires On Jagan Administration
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండీ అమరావతి ప్రాంతంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. అయితే ఈ ఆందోళనలను అణచివెయ్యటానికి పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. రాజధాని రైతుల పోరాటానికి అండగా ఆందోళనలు కొనసాగిస్తున్న టీడీపీ నేతల గృహ నిర్బంధాలు, అరెస్ట్ లు నిత్యకృత్యంగా మారాయి. ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ నేత మాజీ మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజధాని కోసం ఆవేదనతో 11 మంది రైతులు చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు . ఇది దున్నపోతు ప్రభుత్వం… ప్రజల ఆందోళన పట్టదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన టీడీపీ హయాంలో అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో అమరావతిలో రాజధానికి వైఎస్ జగన్ ఒప్పుకుని.. ఇప్పుడు మాటమారుస్తున్నారన్నారు. గతంలో అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని గుర్తుచేసిన లోకేష్ రుణాలు ఇవ్వకుండా బ్యాంకులకు తప్పుడు ఫిర్యాదులు కూడా చేశారని ఆరోపించారు. మరోవైపు అమరావతి రైతులను కావాలనే వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు నారా లోకేష్.