తమిళిసై సౌందర్‌ రాజన్ ప్రస్థానం ఇదే

115
Telangana New Governor From Tamil Nadu
Telangana New Governor Background

New Governor For Telangana

తెలంగాణకు కొత్త గవర్నర్‌ని నియమించింది కేంద్రం. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో రాష్ట్ర గవర్నర్‌గా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణలో పాటు మహారాష్ట్ర (భగత్‌సింగ్ కోశ్యారీ), కేరళ (ఆరిఫ్ మహ్మద్ ఖాన్), హిమాచల్ ప్రదేశ్ (బండారు దత్తాత్రేయ), రాజస్థాన్ (కల్‌రాజ్ మిశ్రా) రాష్ట్రాలకు కూడా గవర్నర్‌లను నియమించారు. ఐతే తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న సౌందర్ రాజన్ గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
తమిళిసై సౌందర్ రాజన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్. వృత్తిరిత్యా ఈమె డాక్టర్. సౌంద రాజన్ భర్త సౌందర్ రాజన్ కూడా వైద్యుడే. ప్రస్తుతం ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన తమిళిసై విద్యార్థి సంఘం నేతగా పనిచేశారు. ఆమె తండ్రి కుమారి ఆనందన్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా సేవలందించారు. సౌందర్ రాజన్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ..ఆమె మాత్రం బీజేపీ సిద్దాంతాలు నచ్చి అందులో చేరిపోయారు. 2007లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తమిళిసై సౌందర్ రాజన్ పనిచేశారు. 2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది బీజేపీ. ప్రస్తుతం ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.
సౌందర్ రాజన్ ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పోటీ చేసినా ఒక్కసారీ గెలవలేదు. 2006లో రాధాపురం అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. 2009లో చెన్నై నార్త్ లోక్‌సభ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2011లో వేలచేరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసినా ఫలితం లేదు. అక్కడా ఓడిపోయారు. ఇక మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకూడి ఎంపీ స్థానానికి పోటీచేసి మరోసారి ఓటమిని మూటగట్టుకున్నారు సౌందర్ రాజన్. ఇప్పుడు తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సేవలు అందించనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here