కొత్త టౌన్ షిప్పులకు స్వాగతం

27
New Integrated Townships @ ORR
New Integrated Townships @ ORR

New Integrated Townships @ ORR

ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పులను ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలోని అన్ని ఏరియాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పులను పీపీపీ విధానంలో డెవలప్ చేయడానికి అనుమతినిస్తారు. కాకపోతే, 111 జీవో ఏరియాల్లో వీటికి అనుమతి లేదు.

కొత్త టౌన్ షిప్పులను పట్టణాభివ్రుద్ధి సంస్థలు డెవలప్ చేయవచ్చు. ప్రయివేటు సంస్థలు, కంపెనీలు, ఎస్పీవీలు, వ్యక్తిగతంగా కానీ డెవలప్మెంట్ లో భాగంగా కానీ చేపట్టవచ్చు. టౌన్ షిప్ పాలసీ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రజలకు కావాల్సిన సమస్త సౌకర్యాలు ఒకే చోట లభించాలి. అంటే ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కేవలం నడుచుకుంటూ వెళ్లేలా ఉండాలన్నదే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం.  మరి, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీ ప్రత్యేకతల గురించి చూద్దాం.

 • కనీసం వంద ఎకరాల్లో ఈ టౌన్షిప్పులను ఏర్పాటు చేయాలి. 300 ఎకరాల స్థలమున్నా చేపట్టవచ్చు.
 • టీఎస్ బీపాస్ నిబంధనలూ దీనికీ వర్తిస్తాయి.
 • ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను ఖచ్చితంగా కట్టాలి. ఫ్లాట్లు అయితే 25, 30, 60- 240 చదరపు మీటర్లలో కట్టాలి. ఫ్లాట్లు అయితే 60, 120, 250 గజాల్లో డెవలప్ చేయాల్సి ఉంటుంది.
 • రెసిడెన్షియల్, కమర్షియల్, ఎడ్యుకేషనల్ (కనీసం పదో తరగతి), ఎమినిటీ స్పేసెస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ప్రజా అవసరాలను తీర్చే సదుపాయాల్ని ఏర్పాటు చేయాలి. అంటే, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్, మంచినీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, పోలీసు స్టేషన్, ఫైర్ స్టేషన్ పోస్టులు, శ్మశాన వాటిక, బస్ స్టేషన్ వంటివి డెవలప్ చేయాలి. అంతర్జతంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఏర్పాటు చేయాలి. కనీసం పది శాతం పచ్చదనాన్ని పెంచాలి.
 • గొప్ప విషయం ఏమిటంటే, ఈ టౌన్ షిప్పును ఎలా డిజైన్ చేయాలి? ఎలా ప్లాన్ చేయాలనే విషయాన్ని పూర్తిగా డెవలపర్ కే వదిలేశారు.

ఎలా ముందడుగు వేయాలి?

INTEGRATED TOWNSHIPSని డెవలప్ చేయాలని భావించేవారు డెవలపర్లు, నిర్మాణ సంస్థలు వంటివి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలి. ఈ టౌన్ షిప్పులను కట్టడానికి అర్హులెవరు అనే అంశాన్ని తెలుసుకోవడానికి హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలను సంప్రదించి తెలుసుకోవాలి.

 • ఈ టౌన్ షిప్పులకు అనుమతుల్ని రెండు దశల్లో అందజేస్తారు. టీఎస్ బీపాస్ లో భాగంగా తొలుత ప్రాథమిక అనుమతిని దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అందజేస్తారు. ఆతర్వాత సదరు డెవలపర్ కనీసం మూడు న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్థలం మీద ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు ముప్పయ్ రోజుల దాకా గడువునివ్వాలి.
 • ఆయా స్థలానికి సంబంధించి కానీ అక్కడి డెవలప్మెంట్ గురించి కానీ ఎలాంటి అభ్యంతరాల్లేకపోతే గనక తొంభై రోజుల్లో సంబంధిత డెవలపర్ తొంభై రోజుల్లో డీపీఆర్ లను సమర్పించాలి. సంబంధిత సంస్థ ముప్పయ్ రోజుల్లో అనుమతిని మంజూరు చేయాలన్నది నిబంధన. అనుమతి వచ్చిన ఆరు నెలల్లోపు నిర్మాణ పనుల్ని మొదలు పెట్టొచ్చు.

ప్రోత్సాహాకాలు ఇవే.. 

 • ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పులను డెవలప్ చేసేందుకు ఎలాంటి ఇన్ సెంటివ్స్ ప్రభుత్వం అందజేస్తుందో తెలుసా?
 • నిషేధిత భూముల జాబితాలో లేకపోతే ఆయా స్థలాన్ని ఆటోమెటిక్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తారు. ఇందుకు తగ్గ సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.
 • డెవలప్మెంట్ ఛార్జీల మీద 90 శాతం మినహాయింపు ఉంటుంది.
 • ఇంపాక్టు ఫీజును ఐదేళ్లలో చెల్లించేందుకు అంగీకరిస్తారు.
 • అల్పాదాయ, నిరుపేదలకు నిర్మించే ఇళ్ల నుంచి వంద శాతం, ఎంఐజీ ఇళ్లపై 75 శాతం, హెచ్ఐజీ ఇళ్లపై 50 శాతం డెవలప్మెంట్ చార్జీల మినహాయింపు ఉంటుంది.
 • క్లబ్ హౌజ్ పై వంద శాతం ఆస్తి పన్ను మినహాయింపును ఇస్తారు. ఇతర ఆస్తుల మీద 50 శాతం రిబేటునిస్తారు. అది కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రోజు నుంచి ఐదేళ్ల దాకా అందజేస్తారు.
 • గిఫ్టు డీడ్ లను వందరూపాయల స్టాంపు పేపర్ మీద రాసిస్తే సరిపోతుంది.

Hyderabad Integrated Townships

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here