బ్యాలెట్ కు వెళ్లేది లేదు

NO BALLOT AGAIN

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు వద్దంటూ ప్రతిపక్షాలు పోరుబాట పట్టిన నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ కుదరదని, మరోసారి బ్యాలెట్ బ్యాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా స్పష్టంచేశారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌కు తలొగ్గబోమని తేల్చి చెప్పారు. ఈవీఎంల పనితీరుపై కొందరు ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్టాడుతూ.. బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ కుదరదని తేల్చి చెప్పారు. ‘ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా బ్యాలెట్‌ పేపర్ల విధానానికి వెళ్లేది లేదు. బ్యాలెట్‌ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్‌ సిబ్బందికి నరకంలా ఉంటుంది. బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి మళ్లీ బ్యాలెట్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని విమర్శించారు.

2014 లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్‌.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయని, నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా అని ప్రశ్నించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐఎల్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌)లో రూపొందిస్తారని వెల్లడించారు. వీటిని హ్యాక్‌ లేదా ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని స్పష్టంచేశారు. వీవీప్యాట్‌ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీటి విషయంలో ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article