ఎన్టీఆర్ బెనిఫిట్ షో లకు అనుమతి నిరాకరణ అందుకే

No permision for NTR benifit show in Telangana

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాపై తెలంగాణ శాసనసభ ఎన్నికల దెబ్బ పడినట్లే కనిపిస్తోంది. బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో అనుమతి ఇచ్చింది. బాలకృష్ణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిసి బెనిఫిట్ షోలకు అనుమతి కోరారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా పన్ను మినహాయింపు సౌకర్యం కూడా కల్పించారు. దానిపై తెలంగాణవాదుల నుంచి కేసీఆర్ విమర్శలు కూడా ఎదుర్కున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు బాలకృష్ణకు తెలంగాణ పెద్దలతో సన్నిహిత సంబంధాలే కొనసాగాయి.
టీఆర్ఎస్ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత హైదరాబాదులోని బసవతారకం మెమోరియల్ ట్రస్టు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. తెలంగాణ పెద్దలతో బాలయ్యకు ఉన్న సన్నిహిత సంబంధాలు తెలంగాణ శాసనసభ ఎన్నికలతో దెబ్బ తిన్నాయి. అభిమానులను అదుపు చేయలేకపోవడం, అనవసమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వంటి సమస్యల కారణంగా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నప్పటికీ కథానాయకుడు సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం వెనక రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి, కేసీఆర్ ఎన్టీ రామారావు అభిమాని. ఆ కారణంగానే తన కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఎన్టీఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ బాలయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర పట్ల కేసీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం.
ఇదే సమయంలో రామ్ చరణ్ తేజ నటించిన వినయ విధేయ రామ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తుందో వేచి చూడాల్సిందేనని అంటున్నారు. చెర్రీ తెలంగాణ అల్లుడు కావడం, కేటీఆర్ కు సన్నిహిత మిత్రుడు కావడం ఆ సినిమాకు లాభించే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article